జస్‌ప్రీత్ బుమ్రా
న్యూఢిల్లీ: స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. వెస్టిండీస్ గడ్డపై సిరీస్ తర్వాత గాయంతో జట్టుకు దూరమైన అతను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. స్వదేశంలో వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే టి20, ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లకు బుమ్రాను సెలక్టర్లు ఎంపిక చేశారు. బుమ్రా ఫిట్‌గా ఉన్నట్లు టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ నివేదిక ఇవ్వడంతో అతని రాక ఖాయమైంది. అయితే ఈ సిరీస్‌లకు ముందు బుమ్రా తన మ్యాచ్ ఫిట్‌నెస్ కోసం గుజరాత్ తరఫున ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడతాడు.
రాబోయే రెండు సిరీస్‌ల కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్లను ఎంపిక చేసింది. గాయం కారణంగానే విండీస్‌తో సిరీస్‌లకు దూరంగా ఉన్న శిఖర్ ధావన్ కూడా మళ్లీ జట్టులోకి వచ్చాడు. గత రెండు సిరీస్‌లకు ఎంపికైనా... ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాని సంజూ సామ్సన్‌ను మరోసారి బ్యాకప్ ఓపెనర్‌గా లంకతో టి20 సిరీస్‌కు ఎంపిక చేశారు. మరోవైపు వెన్నునొప్పితో విండీస్‌తో రెండు మ్యాచ్‌లు ఆడని దీపక్ చాహర్ ఇంకా కోలుకోలేదు. దాంతో అతని స్థానంలో నవదీప్ సైనీ కొనసాగుతాడు.
షమీకి బ్రేక్...
2019లో భారత జట్టులో అందరికంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మకు ఊహించినట్లుగానే విశ్రాంతి లభించింది. శ్రీలంకతో టి20లకు అతను దూరంగా ఉంటాడు. అయితే ఆసీస్‌తో వన్డేల్లో మాత్రం రోహిత్ బరిలోకి దిగుతాడు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన పేసర్ మొహమ్మద్ షమీకి కూడా సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. భువనేశ్వర్, హార్దిక్ పాండ్యాలు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వారి పేర్లను పరిశీలించలేదు. ఎప్పటిలాగే మహేంద్ర సింగ్ ధోని విషయంలో సెలక్టర్లు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతానికి ఈ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యా చేయలేనని ఎమ్మెస్కే చెప్పారు. జనవరి 5, 7, 10 తేదీల్లో శ్రీలంకతో 3 టి20ల్లో... జనవరి 14, 17, 19 తేదీల్లో ఆస్ట్రేలియాతో 3 వన్డేల్లో భారత్ తలపడుతుంది.
భారత జట్ల వివరాలు
శ్రీలంకతో 3 టి20లకు: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, జడేజా, శివమ్ దూబే, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సైనీ, శార్దుల్ ఠాకూర్, మనీశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజు సామ్సన్.
ఆస్ట్రేలియాతో 3 వన్డేలకు: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్, బుమ్రా, షమీ.
‘ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముగ్గురు ఓపెనర్లు కూడా అందుబాటులో ఉంటారు. చాహర్‌కు అనూహ్యంగా వెన్ను నొప్పి వచ్చింది. అయితే మనకు తగినంత సంఖ్యలో రిజర్వ్ పేస్ బౌలర్లు ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యాను న్యూజి లాండ్‌లో పర్యటించే భారత ‘ఎ’ జట్టులోకి ఎంపిక చేశాం ’ –ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ సెలక్టర్
Comments
Please login to add a commentAdd a comment