అంపైర్లకు బీసీసీఐ పాఠాలు!
ముంబై:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సరికొత్త బాధ్యతకు శ్రీకారం చుట్టింది. క్రికెట్ మ్యాచ్ ఫలితాల్లో కీలక పాత్ర పోషించే అంపైర్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ను మెరుగుపరిచేందుకు సిద్దమైంది. దీనిలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ), బ్రిటీష్ కౌన్సిల్ సంయుక్తంగా రూపొందించిన కోర్సులను బ్యాచ్లు వారీగా బీసీసీఐ నిర్వహించనుంది.
ఈ మేరకు తొలి బ్యాచ్ కు ఈ నెల 12 నుంచి 16 వరకూ ముంబైలో శిక్షణ ఇవ్వనుండగా, జూలై 16 నుంచి 23వ తేదీ వరకూ రెండో బ్యాచ్ కు శిక్షణ ఇవ్వనుంది. జట్టు కెప్టెన్లతోపాటు క్రికెటర్లతో ఫీల్డ్ అంపైర్లు ఎలా సంభాషించాలనేది ఈ కోర్సు ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు థర్డ్ అంపైర్ తో ఫీల్డ్ అంపైర్లు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎటువంటి వ్యాకరణ తప్పులు లేకుండా ఉచ్ఛరించేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుందని బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు అంపైర్ల ఇంగ్లిష్ పాఠాల వివరాలను బీసీసీఐ తన వెబ్ సైట్లో ఉంచింది.