జననీ నారాయణ్, వృందా రాఠి
సాక్షి, హైదరాబాద్: క్రికెట్‌లో అరుదుగా కనిపించే వ్యక్తులు మహిళా అంపైర్లు. మహిళలు జాతీయ స్థాయి మ్యాచ్‌లకు అంపైర్లుగా వ్యవహరించడమే గగనంగా కనిపించే ఈ రోజుల్లో... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) డెవలప్‌మెంట్ అంపైర్స్ ప్యానెల్‌లో భారత మహిళా అంపైర్లు తమ సంఖ్య పెంచుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు మహిళ జీఎస్ లక్ష్మి మ్యాచ్ ఐసీసీ రిఫరీస్ ప్యానల్‌లో చోటు దక్కించుకోగా... తాజాగా ఈ జాబితాలో మరో ఇద్దరు చేరారు.
చెన్నైకి చెందిన జననీ నారాయణ్, నవీ ముంబైకి చెందిన వృందా రాఠి ‘ఐసీసీ డెవలప్‌మెంట్ అంపైర్స్’ అంతర్జాతీయ ప్యానల్‌కు ఎంపికైనట్లు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. దీంతో ఈ ప్యానల్‌లో భారత మహిళా అధికారుల సంఖ్య మూడుకు చేరింది. ఈ డెవలప్‌మెంట్ అంపైర్స్ ప్యానల్ అనేది పలు రీజియన్లకు చెందిన అత్యుత్తమ అంపైర్లు, రిఫరీలను ఎంపిక చేసి అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు ఉపయోగపడుతుంది. అత్యంత కఠినంగా ఉండే బీసీసీఐ లెవల్–2 అంపైరింగ్ పరీక్షను పాసైన మహిళా అధికారులుగా గతంలోనే గుర్తింపు తెచ్చుకొని.... ప్రస్తుతం అత్యున్నత స్థాయి అంపైరింగ్ ప్యానల్‌లో చోటు దక్కించుకున్న జనని, వృందా గురించి చూస్తే...
జననీ నారాయణ్: 34 ఏళ్ల జనని 2018 నుంచి దేశవాళీ టోర్నీలకు అంపైర్‌గా వ్యవహరిస్తోంది. క్రికెట్ వీరాభిమాని అయిన జనని ఇంగ్లండ్ అంపైర్ డేవిడ్ షెఫర్డ్, ఎస్. వెంకటరాఘవన్ (భారత్)లను ఆదర్శంగా తీసుకుంది. 2015లోనే తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి లోకల్ డివిజన్ మ్యాచ్‌లకు అధికారిగా వ్యవహరించింది. ఎంసీసీ నిబంధనలపై మంచి పట్టు ఉన్న ఆమె... ఎంతో కష్టపడి బీసీసీఐ లెవల్–1 కోర్సును కూడా పూర్తిచేసింది. తర్వాత థియరీ, ప్రాక్టికల్స్‌తో కూడిన కఠినమైన లెవల్–2 పరీక్షలోనూ మెరుగ్గా రాణించి.. జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించింది.
వృందా రాఠీ: మాజీ క్రికెటర్, స్కోరర్ అయిన వృందాకు క్రికెట్‌తో మంచి అనుబంధముంది. స్వతహగా మీడియం పేసర్ అయిన వృందా కాలేజీ స్థాయిలో 2007 నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు ముంబై యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించింది. 2008–09 ఆలిండియా చాంపియన్‌గా నిలిచిన ముంబై యూనివర్సిటీ జట్టులో ఆమె సభ్యురాలు కూడా. అదే ఏడాది నుంచి బీసీసీఐ స్కోరర్‌గా కెరీర్ ప్రారంభించిన వృందా... 2013 మహిళల ప్రపంచ కప్‌లోనూ ఆమె స్కోరర్‌గా పనిచేసింది. న్యూజిలాండ్ అంపైర్ క్యాతీ క్రాస్‌ను చూసి స్ఫూర్తి పొంది అంపైరింగ్ వైపు మొగ్గు చూపింది. 2014లో రాష్ట్ర స్థాయిలో అంపైరింగ్ పరీక్ష పాసైన వృందా వివిధ స్థాయి టోర్నీల్లో 150 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించింది. తర్వాత 2016లో బీసీసీఐ లెవల్–1 పరీక్షలో 94 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి 2017లో లెవల్–1 కోర్సును పూర్తిచేసింది. 2018లో లెవల్–2ను ముగించి ‘బీసీసీఐ దేశవాళీ అంపైర్ల ప్యానల్’లో చోటు దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment