చైర్మన్‌గా ఏకగ్రీవ ఎన్నిక
డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు
దుబాయ్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1 నుంచి ఐసీసీ చైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతున్న గ్రేగ్ బార్క్‌లే మూడోసారి ఆ పదవిలో కొనసాగేందుకు విముఖత చూపించడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే జై షా మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నిక ఎకగ్రీవమైంది.
35 ఏళ్లకే అత్యున్నత పదవీ బాధ్యతలు దక్కించుకున్న జై షా ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచారు. 2019 నుంచి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతున్న జై షా రెండేళ్ల పాటు ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతారు. భారత్ నుంచి ఐసీసీ పీఠం దక్కించుకున్న ఐదో భారతీయుడిగా జై షా నిలిచారు.
గతంలో జగ్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ‘అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఐసీసీ సభ్యదేశాలతో కలిసి క్రికెట్‌కు మరింత విస్తరించడానికి కృషి చేస్తా’అని జై షా పేర్కొన్నారు.
ఐసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షాను పలువరు అభినందించారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కోచ్‌లు రాహుల్ ద్రవిడ్, కుంబ్లే, పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా శుభాకాంక్షలు తెలిపారు.
ముందున్న సవాళ్లు!
ఈ ఏడాది చివర్లో ఐసీసీ పగ్గాలు చేపట్టనున్న జై షా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడంపై సందేహాలు రేకెత్తుతుండగా... ఈ అంశంలో జై షా ఎలాంటి వైఖరి అవలంభిస్తారనేది కీలకంగా మారింది. జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా పాకిస్తాన్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను హైబ్రిడ్ పద్ధతిలో పాకిస్తాన్, శ్రీలంకలో నిర్వహించారు.
టీమిండియా ఆడాల్సిన మ్యాచ్‌లను శ్రీలంకలో జరిగే విధంగా షెడ్యూల్‌లో మార్పులు చేశారు. మరి ఇప్పుడు ఐసీసీ చైర్మన్‌గా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ భాగం కావడంతో దానికి తగినంత ప్రచారం నిర్వహించడం... రోజు రోజుకు ప్రభ తగ్గుతున్న టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం తేవడం... టి20ల ప్రభావంతో ప్రాధాన్యత కోల్పోతున్న వన్డేలను మరింత రసవత్తరంగా మార్చడం ఇలా పలు సవాళ్లు జై షాకు స్వాగతం పలుకుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment