భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కాబోయే చైర్మన్ అంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన నిజంగానే ఈ పదవిని చేపడితే.. బీసీసీఐ సెక్రటరీగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎవరన్న అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తెర మీదకు కొత్త పేరు
ఇప్పటికే జై షా వారసులుగా ముగ్గురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శి ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్‌లలో ఒకరు జై షా స్థానాన్ని భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రేసులో తాజాగా మరో పేరు తెర మీదకు వచ్చింది.
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా పోటీలో ఉన్నట్లు వార్తా సంస్థ దైనిక్ భాస్కర్ వెల్లడించింది. రోహన్ జైట్లీ మరెవరో కాదు. దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడు. రోహన్ నియామకం దాదాపుగా ఖరారైపోయిందని.. బీసీసీఐ కొత్త కార్యదర్శిగా అతడిని చూడబోతున్నామంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి.
జై షా ఎన్నిక ఏకగ్రీవమే?
మరోవైపు.. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఎన్నిక ఏకగ్రీవం కానుందని తెలుస్తోంది. ఐసీసీలోని మొత్తం 16 మంది సభ్యుల్లో 15 మంది జై షాకు అనుకూలంగా ఉండటం ఇందుకు కారణం. ఇక కొత్త చైర్మన్ ఎన్నిక కోసం ఈ నెల 27తో నామినేషన్ల గడువు ముగుస్తుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా ఉన్న గ్రెగ్ బార్‌క్లే పదవీకాలం నవంబర్ 30 వరకు ఉంది. కాబట్టి.. కొత్తగా ఎన్నికైన వ్యక్తి డిసెంబర్ 1 తర్వాతే పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఫలితంగా జై షా ఇంకో మూడు నెలల పాటు బీసీసీఐ కార్యదర్శిగానే కొనసాగే అవకాశం ఉంది. అప్పటిలోగా అతడి వారసుడి ఎంపిక పూర్తి చేయాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు.
చదవండి: రిటైర్మెంట్ తర్వాత.. అభిమానులకు శుభవార్త చెప్పిన ధావన్
Comments
Please login to add a commentAdd a comment