భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లో మరింత పారదర్శకతను తీసుకొస్తామని బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన అజయ్ షిర్కే స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లో మరింత పారదర్శకతను తీసుకొస్తామని బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన అజయ్ షిర్కే స్పష్టం చేశారు. బోర్డును సరైన దిశలో ముందుకు తీసుకువెళ్లడానికి ఏది ముఖ్యమో అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు షిర్కే పేర్కొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడిగా ఎన్నికైన యువ అనురాగ్ ఠాకూర్ పరిపాలనలో ముందుకు సాగుతామన్నారు. అనురాగ్ యువకుడే కాకుండా, ఉత్సాహవంతుడు కావడంతో అందరీ అభిమానాన్ని చూరగొంటామన్నారు. 'అన్ని వివాదాలను అధిగమిస్తాం. బోర్డులో పారదర్శకత తీసుకొస్తే వివాదాలు సమసి పోతాయి. భారత క్రికెట్ కోచ్ పదవికి ప్రకటన ఇవ్వడం కూడా పారదర్శకతలో భాగమే' అని షిర్కే పేర్కొన్నారు.
గతంలో బోర్డు కోశాధికారిగా పని చేసిన షిర్కే ఆదివారం కార్యదర్శిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 2013 స్పాట్ ఫిక్సింగ్ వివాదం సమయంలో బీసీసీఐ స్పందన బాగా లేదంటూ షిర్కే తన పదవికి రాజీనామా చేశారు. ఈ అంశంపై తాజాగా స్పందించిన షిర్కే..అదొక చరిత్ర అంటూ వ్యాఖ్యానించారు.