టీమిండియా కోచ్ పదవి రేసులో ఉన్నా
ముంబై: టీమిండియా కోచ్ పదవికి చాలా పేర్లు వినిపించాయి. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ ప్రస్తుత చైర్మన్ సందీప్ పాటిల్ ఈ పదవికి పోటీపడుతున్నాడు. కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్టు పాటిల్ స్వయంగా చెప్పాడు.
2012 సెప్టెంబర్లో సెలెక్షన్ కమిటీ చైర్మన్గా పాటిల్ బాధ్యతలు చేపట్టాడు. నాలుగేళ్ల ఈ పదవీకాలం త్వరలో ముగియనుంది. టీమిండియా సెలెక్షన్ కమిటీ చైర్మన్గా కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు సమర్థవంతంగా పనిచేశాడని పేరుతెచ్చుకున్న పాటిల్.. కోచ్ పదవిని ఆశిస్తున్నాడు. కాగా కోచ్ పదవి కోసం చాలామంది పోటీపడుతున్నారు. విక్రమ్ రాథోడ్, ప్రవీణ్ ఆమ్రే, లాల్ చంద్ రాజ్పుట్, రుషికేష్ కనిత్కర్ రేసులో ఉన్నట్టు సమాచారం. పదవీకాలం పూర్తికావడంతో టీమిండియా డైరెక్టర్గా ఇటీవల వైదొలిగిన రవిశాస్త్రి కూడా పోటీపడవచ్చని క్రికెట్ వర్గాలు తెలిపాయి. టీమిండియా కోచ్ పదవికి మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ సహా పలువురి పేర్లు ఇంతకుముందు వినిపించాయి. ఇంతకీ టీమిండియా కోచ్ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.