
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఎనిమిదో విజయాన్ని సాధించింది. శనివారం జరిగిన పోరులో బెంగాల్ 33–29 స్కోరుతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. బెంగాల్ రైడర్లు ఆట ఆరంభం నుంచి మ్యాచ్ ముగిసేదాకా జట్టును ఆధిక్యంలో నిలిపారు. మరోవైపు బెంగళూరు బుల్స్ ఏ దశలోనూ ప్రత్యర్థి స్కోరును అందుకోలేకపోయింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి వారియర్స్ 18–10తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. బెంగాల్ రైడర్లలో మణిందర్ సింగ్ (9 పాయింట్లు) రాణించాడు. 14 సార్లు రైడింగ్‌కు వెళ్లిన మణిందర్ 9 పాయింట్లు తెచ్చిపెట్టాడు. టాకిల్‌లో సుర్జిత్ సింగ్ 5 పాయింట్లు చేశాడు. ఓవరాల్‌గా అతను 6 పాయింట్లు సాధించాడు.
మిగతా వారిలో దీపక్ నర్వాల్ 7, రాణ్ సింగ్ 4 పాయింట్లు చేశారు. బెంగళూరు బుల్స్ తరఫున హరీశ్ నాయక్ (11) ఆకట్టుకున్నాడు. మిగతావారిలో రవీందర్ పాహల్, మహేందర్ సింగ్ తలా 5 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 34–29తో దబంగ్ ఢిల్లీపై నెగ్గింది. పుణేరి జట్టులో దీపక్ హుడా (10) అదరగొట్టాడు. రాజేశ్ మోండల్, గిరీశ్ మారుతి ఎర్నాక్ చెరో 5 పాయింట్లు చేశారు. దబంగ్ ఢిల్లీ తరఫున మిరాజ్ షేక్ (7), రోహిత్ బలియాన్ (6), అబొల్‌ఫజల్ (5) రాణించారు. ఆదివారం జరిగే పోటీల్లో తమిళ్ తలైవాస్‌తో బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీతో హరియాణా స్టీలర్స్ తలపడతాయి