
కార్డిఫ్: తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచి ప్రపంచకప్ సమరాన్ని ఘనంగా ఆరంభిస్తామని టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. అయితే ఇప్పటివరకు దక్షిణాఫ్రికా కోసం ఎలాంటి ప్రణాళికలు, వ్యూహాలు రచించలేదని తెలిపాడు. తమ షెడ్యూల్ ప్రకారం కేవలం ప్రాక్టీస్ మాత్రమే చేస్తున్నామని తెలిపిన భువీ.. ప్రొటీస్ జట్టుపై గెలవాలంటే ప్రతీ ఒక్క ఆటగాడిపై ప్రత్యేక వ్యూహాలు రచించాలన్నాడు. రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడటంతో ప్రస్తుతం ఇంగ్లండ్ పరిస్థితులు, పిచ్‌లపై ఓ అవగాహన వచ్చిందన్నాడు.
‘ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో ఆటగాళ్లపై ఒత్తిడి అనేది సహజం. కానీ ఆ ఒత్తిడిని అధిగమించినప్పుడు విజయం సాధిస్తాం. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. క్లిష్ట సమయాల్లో రాణిస్తే నాపై నాకు విశ్వాసం పెరుగుతుంది. ఇంగ్లండ్‌లోని పేస్ పిచ్‌లపై మా(భువీ, బుమ్రా, షమీ)పాత్ర కీలకం కానుంది. మాపై మాకు నమ్మకం ఉంది. టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషిస్తాం. ప్రస్తుతం తొలి మ్యాచ్ కోసం ఎలాంటి వ్యూహాలు రచించలేదు. ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఈలోపే దక్షిణాఫ్రికాలోని ప్రతీ ఆటగాడి కోసం వ్యూహాలు రచిస్తాం’అని భువీ తెలిపాడు.
కాగా, జూన్ 5న తన తొలి పోరులో దక్షిణాఫ్రికాను కోహ్లి సేన ఢీ కొట్టనుంది. అయితే చివరగా ఇరుజట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 5-1తేడాతో విజయం సాధించింది. ఇది కోహ్లి సేనకు సానుకూల అంశం. అయితే ఆప్పుడు ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు డికాక్, డుప్లెసిస్, డివిలియర్స్‌లు లేరు. అయితే డివిలియర్స్ రిటైర్ అయినప్పటికీ ప్రస్తుతం ప్రొటీస్ జట్టులో డికాక్, డుప్లెసిస్‌లు ప్రమాదకర ఆటగాళ్లు. ఇక ఈ మ్యాచ్ గెలుస్తామని ఇరుజట్లు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment