బ్లాస్టర్స్ లెక్క సరి చేస్తారా!
వారియర్స్‌తో నేడు రెండో టి20
క్రికెట్ ఆల్‌స్టార్స్ సిరీస్
హోస్టన్: అమెరికాలోని క్రికెట్ అభిమానులు దిగ్గజాల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు మరో అవకాశం. ఆల్‌స్టార్స్ సిరీస్‌లో భాగంగా నేడు జరిగే రెండో టి20 మ్యాచ్‌లో సచిన్ బ్లాస్టర్స్ జట్టు వార్న్ వారియర్స్‌లో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన సచిన్ సేన సిరీస్‌లో నిలబడాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం తప్పనిసరి. మొదటి మ్యాచ్‌లాగే దీనికి కూడా స్థానిక బేస్‌బాల్ మైదానం వేదిక కానుంది. ఇక్కడి మినట్ మెయిడ్ పార్క్‌లో టి20 మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్ తర్వాత వరుసగా క్రికెట్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న వెటరన్లు రెండో మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యారు.
సచిన్ జట్టులో అతనితో పాటు సెహ్వాగ్ మాత్రమే గత మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రంజీ ట్రోఫీ ద్వారా ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఉన్న సెహ్వాగ్ తనదైన శైలిలో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్మణ్‌కు బదులుగా గంగూలీ బరిలోకి దిగే అవకాశం ఉంది. బౌలింగ్‌లో షోయబ్ అక్తర్, మురళీలలో కాస్త మెరుపు కనిపించింది. పదును లేని ఆంబ్రోస్ స్థానంలో మెక్‌గ్రాత్‌కు అవకాశం దక్కవచ్చు.
ఇక వారియర్స్ కెప్టెన్ షేన్‌వార్న్ ఫుల్ జోష్‌తో ఫిట్‌గా బౌలింగ్ చేశాడు. వరల్డ్ కప్ కూడా ఆడిన వెటోరి వెటరన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక స్టార్స్ అందరిలోకి ఇటీవలి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో టచ్‌లో ఉన్న సంగక్కర అలవోక బ్యాటింగ్‌కు తోడు పాంటింగ్ చురుకుదనం వారియర్స్‌ను గెలిపించాయి. ఈ సారి కూడా అదే పునరావృతం అవుతుందేమో చూడాలి. వార్న్ జట్టు మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఈసారీ హోరే...
న్యూయార్క్‌లో జరిగిన తొలి మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు. ఎవరూ ఊహించని విధంగా 35 వేల మంది మ్యాచ్‌కు రావడం ఐసీసీని కూడా ఆశ్చర్యపరిచింది. ఎక్కువ సంఖ్యలో భారతీయులు వచ్చినా... ఆస్ట్రేలియా, పాకిస్తాన్ అభిమానులు కూడా వేలాదిగా వచ్చారు. మిగిలిన రెండు మ్యాచ్‌లు జరిగే హోస్టన్, లాస్‌ఏంజిల్స్‌లో కూడా చాలావరకు టిక్కెట్లు అమ్ముడయ్యాయి. కాబట్టి ఈసారి కూడా స్టేడియం అభిమానులతో హోరెత్తనుంది.
భారత కాలమానం ప్రకారం గురువారం (రేపు) ఉదయం గం. 7. 30నుంచి స్టార్ స్పోర్ట్స్ 2లో ప్రత్యక్ష ప్రసారం