
బ్లేజర్ కూడా సెంచరీ కొట్టింది
క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్ మెన్ బ్లేజర్ కూడా సెంచరీ మార్కు దాటింది. ఇదేంటనుకుంటున్నారా.. కెప్టెన్ గా తొలి సిరీస్ లో డాన్ బ్రాడ్ మెన్ వేసుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ బ్లేజర్ రికార్డు ధరకు అమ్ముడు పోయింది. ఇవాళ సిడ్నీలో జరిగిన వేలం పాటలో ఈ గ్రీన్ కలర్ బ్లేజర్ 132 వందల ఆస్ట్రేలియన్ డాలర్ల ( భారత కరెన్సీలో 61 లక్షల పై చిల్లర) ధర పలికింది. డాన్ బ్రాడ్ మెన్ ఈ బ్లేజర్ ను 1936-37 యాషెస్ సిరీస్ సందర్భంగా ధరించాడు. ఈ సిరీస్ ను ఆస్ట్రేలియా 3-2తో గెలిచింది. నిర్వాహకులు ఈ బ్లేజర్ 70 వేల నుంచి 90 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు పలుకుతుందని ఊహించారు. అందరి అంచనాలను దాటి.. బ్లేజర్ సెంచరీ మార్కు దాటిందని వేలం పాట నిర్వాహకులు మాక్స్ విలియమ్సన్ తెలిపారు. మరో 32 వేల డాలర్లు ట్యాక్స్ గా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. బ్రాడ్ మెన్ బ్లేజర్స్ వేలం వేయడం ఇదే తొలి సారి అని వివరించాడు. బ్రాడ్ మెన్ అభిమానులు ఆయన వస్తువులను సేకరించేందుకు ఉత్సాహంగా ఉంటారని.. 2008లో బ్రాడ్ మెన్ ధరించిన బ్యాగీ గ్రీన్ క్యాప్ వేలంపాటలో 4లక్షల 2 వేల 500 ఆస్ట్రేలియన్ డాలర్ల విలువ పలికిన సంగతి గుర్తు చేశారు.