భళా... బింద్రా
ఒలింపిక్స్... ప్రపంచ చాంపియన్‌షిప్... ప్రపంచకప్... కామన్వెల్త్ గేమ్స్... ఆసియా చాంపియన్‌షిప్... ఇలా అన్ని గొప్ప వేదికలపై వ్యక్తిగత స్వర్ణ పతకాలను నెగ్గిన భారత షూటర్ అభినవ్ బింద్రా కెరీర్‌లో ఇన్నాళ్లూ ఆసియా క్రీడల్లో వ్యక్తిగత పతకం లోటుగా ఉండేది. అయితే మంగళవారం బింద్రా తన స్థిరమైన ప్రదర్శనతో ఇంతకాలం అందని ద్రాక్షగా ఉన్న ఆసియా క్రీడల వ్యక్తిగత పతకాన్ని అందుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అతను వ్యక్తిగత విభాగంతోపాటు టీమ్ అంశంలోనూ కాంస్య పతకాలను సాధించాడు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో వరుసగా నాలుగో రోజు భారత షూటర్ల పతకాల వేటను కొనసాగేలా చూశాడు.
ఇంచియాన్: తన కెరీర్‌లో చివరిసారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా అంచనాలకు అనుగుణంగా రాణించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో కాంస్య పతకాలను గెల్చుకున్నాడు. బింద్రా ప్రదర్శనతో ఆసియా క్రీడల్లో వరుసగా నాలుగో రోజూ షూటర్లు పతకాలను అందించారు. వ్యక్తిగత ఫైనల్లో అభినవ్ బింద్రా 187.1 పాయింట్లు సాధించి కాంస్యం దక్కించుకున్నాడు. ఆసియా క్రీడల్లో బింద్రాకిదే తొలి వ్యక్తిగత పతకం కావడం విశేషం. క్వాలిఫయింగ్‌లో పెద్దగా రాణించని బింద్రా ఫైనల్స్‌లో మాత్రం నిలకడను చూపెట్టాడు. 6, 12 షాట్లకు 9.9, 9.6 పాయింట్లు గెలిచి ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత పేలవ షాట్స్‌తో ఐదో స్థానానికి పడిపోయాడు. కానీ కాంస్య పతకం నిర్ధారించే చివరి రెండు షాట్లకు 10.6, 10.7 పాయింట్లు నెగ్గి ప్రత్యర్థిని వెనకకు నెట్టాడు.
టీమ్‌లోనూ హవా: అభినవ్ బింద్రా, రవి కుమార్, సంజీవ్ రాజ్‌పుత్‌ల బృందం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలోనూ సత్తా చాటింది. ఓవరాల్‌గా 1863 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. బింద్రా 625.4 పాయింట్లు, రవి 618.9 పాయింట్లు, రాజ్‌పుత్ 618.7 పాయింట్లు నెగ్గారు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఐదో బెస్ట్ స్కోరు నమోదు చేసిన బింద్రా జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
మహిళల ట్రాప్ విభాగంలో శ్రేయాసి సింగ్ (66 పాయింట్లు), సీమా తోమర్ (63 పాయింట్లు), షగున్ చౌదురీ (59 పాయింట్లు)ల బృందం ఓవరాల్‌గా 188 పాయింట్లు నెగ్గి ఎనిమిదో స్థానంతో సంతృప్తిపడింది. వ్యక్తిగత విభాగంలో ఈ త్రయం నిరాశపర్చింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ క్వాలిఫయింగ్-1లో హర్‌ప్రీత్ సింగ్ (290) పాయింట్లు నెగ్గి ఏడో స్థానంలో నిలవగా, గురుప్రీత్ సింగ్ (284), పెంబా తమాంగ్ (277)లు వరుసగా 14, 18వ స్థానాలతో సరిపెట్టుకున్నారు.
20 ఏళ్లుగా ప్రొఫెషనల్ షూటర్‌గా కొనసాగా. అదే నా జీవితంగా బ్రతికా. అంకితభావంతో ప్రాక్టీస్ చేశా. కానీ ఇక నుంచి నేను హాబీ షూటర్‌ను. సీరియస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాను. వారానికి రెండుసార్లు మాత్రమే ప్రాక్టీస్ చేస్తా. అయితే నేను అకస్మాత్తుగా ఈ నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇప్పుడు హాబీ షూటర్‌గా ఎలా కొనసాగాలనే దానిపై ఆలోచిస్తున్నా. దేశవాళీ టోర్నీలో బరిలోకి దిగుతా. జట్టుకు ఎంపికైతే వరల్డ్‌కప్‌లో ఆడతా. అయితే అది ఒక దశ వరకు మాత్రమే. నా వల్ల కాకపోతే మరొకరికి అవకాశం ఇస్తా. ఆసియా క్రీడల్లో నా ప్రదర్శన బాగుంది. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తా. కానీ దాన్నే లక్ష్యంగా మాత్రం చేసుకోను.
-బింద్రా