బట్లర్ రికార్డు సెంచరీ
దుబాయ్: పాకిస్తాన్‌తో నాలుగో వన్డేలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్ (52 బంతుల్లో 116 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆ దేశం తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 355 పరుగులు చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్ (117 బంతుల్లో 102; 8 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. హేల్స్ (22) విఫలమైనా... రాయ్, రూట్ (71 బంతుల్లో 71; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రెండో వికెట్‌కు 140 పరుగులు జోడించి భారీ స్కోరుకు పునాదులు వేశారు. రూట్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు.
పాక్ బౌలర్లను ఊచకోత కోస్తూ సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 46 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇంగ్లండ్ తరఫున ఇది ఫాస్టెస్ట్ సెంచరీ కాగా, ఓవరాల్‌గా ఆరోది. గతంలో ఇంగ్లండ్ తరఫున చేసిన రెండు ఫాస్టెస్ట్ సెంచరీలు కూడా బట్లర్ పేరిటే ఉండటం విశేషం. కేవలం 16 బంతుల్లోనే రెండో 50 పరుగులు చేసిన బట్లర్... టేలర్ (13)తో కలిసి ఐదో వికెట్‌కు 79; మొయిన్ అలీ (4 నాటౌట్)తో కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 49 పరుగులు సమకూర్చడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధ్యమైంది. ఇర్ఫాన్, అజహర్ అలీ చెరో రెండు వికెట్లు తీశారు.