ఆ ఇద్దరు క్రికెటర్లకు ఊరట!
కరాచీ:స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని దాదాపు ఐదు సంవత్సరాలు నిషేధం ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెటర్లు సల్మాన్ భట్, మొహ్మద్ ఆసిఫ్ లకు కాస్త ఉపశమనం లభించించింది. ఆ ఇద్దరు పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో రెండో సీజన్ పీఎస్ఎల్ కోసం ఆ ఇద్దరు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
గతేడాది పీఎస్ఎల్ నాటికి వీరికి స్పాట్ ఫిక్సింగ్ పై నిషేధం పూర్తయినా ఆడేందుకు అవకాశం దక్కలేదు. ఆ ఇద్దరిపై నిషేధం పూర్తయ్యే సరికి పీఎస్ఎల్ వేలం పూర్తికావడంతో వారికి ఆడే అవకాశం లభించలేదు. ప్రస్తుతం పీసీబీ తీసుకున్న నిర్ణయం తమకు ఎంతగానో ఉపకరిస్తుందని సల్మాన్ భట్ పేర్కొన్నాడు. తాము చేసిన తప్పులు అనేవి గతమని భట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. తాను ఇప్పుడు మానసికంగా చాలా బలంగా ఉన్నానని, ఇక జీవితంలో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఈ మాజీ కెప్టెన్ తెలిపాడు. అంతకుముందు మొహ్మదల్ ఆమిర్ కూడా ఫిక్సింగ్ ఆరోపణలతో ఐదేళ్లు నిషేధం ఎదుర్కొన్న తరువాత పాకిస్తాన్ జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే.