కాన్‌బెరా/కేప్‌టౌన్: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఆసీస్ ఆటగాళ్లపై సొంత బోర్డే ఆగ్రహం వ్యక్తం చేసింది. అసాధారణ చర్యకు పాల్పడటమేకాక, అది జట్టు సమష్టి నిర్ణయమని నిస్సిగ్గుగా చెప్పుకున్న స్టీవ్ స్మిత్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌లను చూసి క్రీడాభిమానులు నివ్వెరపోతున్నారని, ఒక విధంగా దేశం అప్రతిష్టపాలైందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సీఈవో జేమ్స్ సదర్లాండ్ అన్నారు. ట్యాంపరింగ్ ఘటనను బోర్డు తీవ్రంగా పరిగణిస్తున్నదని, తక్షణమే విచారణకు ఆదేశించామని, ఈ మేరకు ఇద్దరి (ఇయాన్ రాయ్, పాట్ హోవార్డ్) బృందం ఇప్పటికే కేప్‌టౌన్‌కు బయలుదేరిందని తెలిపారు. కాగా, ఇప్పటికే స్టీవ్‌స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌లపై వేటుకు రంగం సిద్ధమైందని, విచారణ తంతు ముగిసిన వెంటనే నిర్ణయం వెలువడుతుందని సమాచారం. ఘటన తీవ్రత దృష్ట్యా మొత్తం జట్టుపై చర్యలు తీసుకునే అవకాశాలూ లేకపోలేవని తెలుస్తోంది.
అడ్డంగా దొరికిపోయాడిలా..: దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో అతను చేసిన పనులు వీడియోలో బయట పడ్డాయి. ముందుగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బెన్‌క్రాఫ్ట్ తన కుడి చేతి వేళ్ల మధ్య టేపును ఉంచి బంతి ఆకారాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అతను దానిని తన జేబులో వేసుకున్నాడు. ఇదంతా టీవీలో ప్రసారమైంది. వెంటనే ఆసీస్ కోచ్ లీమన్ అదనపు ఆటగాడు హ్యాండ్స్‌కోంబ్‌కు వాకీటాకీ ద్వారా ఇదే విషయాన్ని చెప్పాడు. దాంతో ఓవర్ల మధ్య మైదానంలోకి వెళ్లిన హ్యాండ్స్‌కోంబ్, బెన్‌క్రాఫ్ట్‌కు ఈ సమాచారం చేరవేశాడు. విషయం తెలుసుకున్న ఫీల్డ్ అంపైర్లు నైజేల్ లాంజ్, ఇల్లింగ్‌వర్త్ ఈ విషయంపై బెన్‌క్రాఫ్ట్‌ను వివరణ అడిగారు. అయితే అప్పటికే ఆ వస్తువును జేబులోంచి తీసిన ఆసీస్ క్రికెటర్ దానిని అండర్‌వేర్‌లో వేసుకున్నాడు. అంపైర్లు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ జేబులోంచి సన్‌గ్లాసెస్ క్లాత్‌ను తీసి చూపించాడు! ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయిన అంపైర్లు బంతిని మార్చకుండా, పెనాల్టీ పరుగులు విధించకుండా ఆటను కొనసాగించారు.
అసలేం జరిగిందంటే..: నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. తొలి టెస్టులో ఆసీస్ నెగ్గగా, రెండో టెస్టును సఫారీలు నిలుపుకున్నారు. దీంతో మూడో టెస్టు కీలకంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా, ఆసీస్ మాత్రం 255 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స ప్రారంభించిన సఫారీలు.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 238 రన్స్ చేసింది. తద్వారా 294 పరుగుల ఆధిక్యతతో మ్యాచ్‌పై పట్టుబిగించింది. సరిగ్గా ఈ సందర్భంలోనే(మూడో రోజు ఆటలో) ఆసీస్ ఆటగాడు కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించడం తీవ్ర వివాదాన్ని రేపింది.
మ్యాచ్ తర్వాతా హైడ్రామా: మూడో రోజు ఆట ముగిసిన తర్వాత స్టేడియంలో హైడ్రామా నెలకొంది. ఆసీస్ సారధి స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌లు మీడియా ముందుకొచ్చి తప్పు చేసినట్లు ఒప్పుకున్నారు. ‘మా ఆటగాళ్ల బృందానికి దీని గురించి తెలుసు. లంచ్ విరామ సమయంలో మేం దీనిపై మాట్లాడుకున్నాం. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని తెలుసు. ఇది నేను బాధపడాల్సిన విషయం. నాకు, మా జట్టుకు ఇది చాలా చెడ్డపేరు తీసుకొచ్చే విషయం. ఇక ముందు ఇలా జరగనివ్వను. అయితే ఇప్పటికిప్పుడు కెప్టెన్సీ నుంచి తప్పుకోబోను’ అని స్మిత్ చెప్పాడు.
బెన్‌క్రాఫ్ట్ వివరణ: స్మిత్‌తో కలిసి ప్రెస్‌తో మాట్లాడిన బెన్‌క్రాఫ్ట్..‘ట్యాంపరింగ్ చేసేందుకు నాకు అవకాశం కనిపించింది. అయితే నా ప్రయత్నం పని చేయలేదు. బంతి ఆకారంలో మార్పు రాలేదు. దాంతో అంపైర్లు బంతిని మార్చలేదు. నేను బంతిని చేత్తో రుద్దుతున్న దృశ్యాలు మైదానంలో భారీ స్క్రీన్‌పై కనిపించాయి. దాంతో కంగారుపడి ఆ టేపును నా ప్యాంట్ లోపల దాచేశాను. పర్యవసానాలను నేను ఎదుర్కోక తప్పదు’అని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు.
(ట్యాంపరింగ్ పూర్తి వీడియో)
Comments
Please login to add a commentAdd a comment