జొహన్నెస్‌బర్గ్/కాన్‌బెరా: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, కామెరూన్ బెన్‌క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించనున్నారా, ప్రధాన కోచ్ డారెన్ లీమన్ తక్షణమే పదవి నుంచి తప్పుకుంటారా అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మంగళవారం ఆస్ట్రేలియన్ ప్రధాన మీడియా నిండా ఇవే కథనాలు.
ట్యాంపరింగ్ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవద్దన్న ప్రధాని టర్న్‌బుల్ సూచన మేరకు ఆస్ట్రేలియా క్రికెట్(సీఏ).. స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లపై కొరడా ఝుళిపించడం ఖాయమని, నాలుగో టెస్టు ప్రారంభానికి ముందే లీమన్ రాజీనామా చేస్తాడని సర్వత్రా చర్చజరుగుతోంది. ఇప్పటికే సౌతాఫ్రికాకు వచ్చి ఆటగాళ్లను విచారిస్తోన్న సీఏ బృందం.. మంగళవారమే తన రిపోర్టును సమర్పించనున్న నేపథ్యంలో నిషేధం వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఐసీసీ చేయనిది సీఏ చేస్తుంది: నిబంధనలకు విరుద్ధంగా బంతి ఆకారాన్ని మార్చి ప్రత్యర్థిని దెబ్బతీయాలనే కుట్ర చేయడమేకాక, అది సమిష్టి నిర్ణయమని చెప్పిన ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అరకొర చర్యలతో సరిపెట్టడం దుమారాన్ని రేపుతోంది. అంతపెద్ద తప్పుకు ఇంత చిన్న శిక్ష ఏమిటనే సందేశాలు వ్యక్తమవుతున్నాయి. తన చేతులతో ట్యాంపర్ చేసిన బెన్‌క్రాఫ్ట్‌పై వేటు పడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐతే, ఆటగాళ్లను శిక్షించడంలో ఐసీసీ చేయనిది సీఏ తప్పక చేస్తుందని ఆసీస్ మీడియా తెలిపింది. క్రికెట్ నిబంధనలను రూపొందించే మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సైతం ట్యాంపరింగ్ ఉదంతంపై ఘాటుగా స్పందించింది. ఆసీస్ ప్లేయర్లను కఠినంగా శిక్షించాల్సిందేనని, అలా చేస్తేనే జెంటిల్మన్ గేమ్ పట్ల భవిష్యత్ తరాలకు మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని ఎంసీసీ ఉపకార్యదర్శి జాన్ స్టీఫెన్‌సన్ అభిప్రాయపడ్డారు.
కుట్రలో హెడ్ కోచ్ పాత్ర ఏంటి?: జట్టు సభ్యులంతా ముందే చర్చించుకుని ట్యాంపరింగ్ కుట్రను అమలు చేసినట్లు చెప్పుకొచ్చిన స్మిత్.. ఇందులో కోచింగ్ స్టాఫ్ ప్రమేయమేది లేదని అన్నాడు. కాగా, స్మిత్ చెప్పినదాంట్లో అర్థంలేదని ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ‘‘కుట్రలో కోచ్ లీమన్‌కు ప్రమేయం లేదంటే.. జట్టుపై అతనికి పట్టులేనట్టు అర్థం. ఒకవేళ ప్రమేయం ఉందని తేలితే ఆటగాళ్లతోపాటు అతనూ దోషే అవుతాడు. ఈ రెండు సందర్భాల్లోనూ లీమన్ తప్పుచేసినవాడే అవుతాడు’’ అని క్లార్క్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment