
వారెవ్వా... వొజ్నియాకి
ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్... ఇప్పుడేమో 74వ ర్యాంకర్... గాయాల బెడద... పెరిగిన యువ క్రీడాకారిణుల జోరు...
⇒సెమీస్‌లోకి డెన్మార్క్ స్టార్
⇒ఐదోసారి ఈ ఘనత
⇒క్వార్టర్స్‌లో అలవోక విజయం
⇒యూఎస్ ఓపెన్ టోర్నీ
ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్... ఇప్పుడేమో 74వ ర్యాంకర్... గాయాల బెడద... పెరిగిన యువ క్రీడాకారిణుల జోరు... ఈ నేపథ్యంలో డెన్మార్క్‌స్టార్ కరోలైన్ వొజ్నియాకి ఎలాంటి అంచనాలు లేకుండానే సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్, గతంలో తనకెంతో కలిసొచ్చిన యూఎస్ ఓపెన్‌లో అడుగుపెట్టింది. తొలి రౌండ్‌లో అమెరికా అనామక క్రీడాకారిణి టేలర్ టౌన్‌సెండ్‌పై మూడు సెట్‌ల పోరులో నెగ్గిన వొజ్నియాకి ఆ తర్వాత ఒక్కసారిగా తనలోని పూర్వ వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా రాణించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. పదోసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతోన్న ఈ మాజీ నంబర్‌వన్ ఐదోసారి సెమీఫైనల్ దశకు చేరుకోవడం విశేషం.
న్యూయార్క్: రెండో రౌండ్‌లో తొమ్మిదో సీడ్ స్వెత్లానా కుజ్‌నెత్సోవాను, ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ మాడిసన్ కీస్‌ను ఓడించిన వొజ్నియాకి అదే జోరును క్వార్టర్ ఫైనల్లోనూ కొనసాగించింది. ప్రపంచ 48వ ర్యాంకర్ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా)తో జరిగిన మ్యాచ్‌లో వొజ్నియాకి 6-0, 6-2తో ఘనవిజయం సాధించింది. కేవలం 64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో వొజ్నియాకి తన ప్రత్యర్థికి కేవలం రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోవడం విశేషం. సెమీఫైనల్లో రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)తో వొజ్నియాకి తలపడుతుంది.
రెండో రౌండ్‌లో మూడో సీడ్ ముగురుజా (స్పెరుున్)పై సంచలన విజయం సాధించిన సెవస్తోవా క్వార్టర్ ఫైనల్లో మాత్రం తడబడింది. తొలి సెట్ రెండో గేమ్‌లో సెవస్తోవా కోర్టులో జారిపడటంతో ఆమె కుడి కాలి చీలమండకు గాయమైంది. ఆ తర్వాత ఆమె కోర్టులో చురుకుగా కదల్లేకపోరుుంది. మరోవైపు వొజ్నియాకి ఈ అవకాశాన్ని అనుకూలంగా మల్చుకొని వ్యూహాత్మకంగా ఆడి విజయాన్ని దక్కించుకుంది. వొజ్నియాకి తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేయడంతోపాటు నెట్‌వద్దకు 15 సార్లు దూసుకొచ్చి 11 పారుుంట్లు గెలిచింది. 14 విన్నర్స్ కొట్టిన ఆమె కేవలం ఐదు తప్పిదాలు చేసింది.
‘యూఎస్ ఓపెన్ అంటే నాకెంతో ఇష్టం. సెమీస్‌కు చేరడం చాలా గొప్పగా అనిపిస్తోంది. సెవస్తోవా గాయపడటం బాధ కలిగించింది. గతంలో నేను కూడా చీలమండ గాయంతో బాధపడ్డాను’ అని 26 ఏళ్ల వొజ్నియాకి తెలిపింది. 2013లో టెన్నిస్‌కు వీడ్కోలు పలికి 2015లో పునరాగమనం చేసిన 26 ఏళ్ల సెవస్తోవా తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. దినారా సఫీనా (రష్యా), జెలెనా జంకోవిచ్ (సెర్బియా) తర్వాత నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచి ఒక్క గ్రాండ్‌స్లామ్ కూడా నెగ్గని మూడో క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన వొజ్నియాకి రెండుసార్లు యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది.
సెమీస్‌లో ప్లిస్కోవా: మహిళల సింగిల్స్ విభాగంలో పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్లిస్కోవా 6-2, 6-2తో అనా కొంజు (క్రొయేషియా)పై గెలిచి తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీస్‌కు చేరుకుంది. సెరెనా (అమెరికా), సిమోనా హాలెప్ (రొమేనియా)ల మధ్య జరిగే చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీస్‌లో ప్లిస్కోవా తలపడుతుంది.