చహాల్ చేతిలో ఢమాల్
జంషెడ్‌పూర్: సీజన్ తొలి మ్యాచ్‌లో అద్భుత విజయంతో ఆశలు రేపిన హైదరాబాద్ రంజీ జట్టు రెండో మ్యాచ్‌లో తడబడింది. హరియాణాతో ఇక్కడ కీసన్ స్టేడియంలో ప్రారంభమైన గ్రూప్-సి మ్యాచ్‌లో జట్టు బ్యాట్‌మెన్ విఫలమయ్యారు. ఫలితంగా తొలి రోజు హైదరాబాద్ 82.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. సందీప్(120 బంతుల్లో 44;5 ఫోర్లు) మాత్రమే కొద్దిగా పోరాడాడు. హరియాణా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్(6/44) ఆరు వికెట్లతో హైదరబాద్ వెన్నువిరిచాడు.
టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.అయితే ఆరంభంలోనే తన్మయ్(13) రనౌట్ కాగా,మరుసటి ఓవర్లోనే అక్షత్ రెడ్డి(13)ని హర్హల్ పటేల్ బౌల్డ్ చేశాడు. అనిరుథ్(17),కెప్టెన్ బద్రీనాథ్(27) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు.
ఈ దశలో సందీప్, కొల్లా సుమంత్ కలిసి జట్టును ఆదుకునే యత్నం చేశారు.వీరిద్దరూ ఐదో వికెట్‌కు 71 పరుగులు జోడించారు.అయితే తక్కువ వ్యవధిలోనే వీరిద్దర్ని అవుట్ చేసి చహాల్ హైదరాబాద్‌ను దెబ్బతీశాడు. లోయర్ ఆర్డర్‌లో ఎవరూ నిలబడలేకపోవడంతో జట్టు 14 పరుగుల వ్యవధిలో మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. దాంతో చహాల్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. గతంలో 21 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయని అతను ఈ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీయడం విశేషం.