నేటి నుంచి సీటీఎల్ సందడి
బెంగళూరు రాఫ్టర్స్‌తో హైదరాబాద్ ఏసెస్ ఢీ
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్‌లో కొత్త తరహా ఫార్మాట్‌తో ముందుకు వచ్చిన చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)కు రంగం సిద్ధమైంది. భారత దిగ్గజ ఆటగాడు విజయ్ అమృత్‌రాజ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ టోర్నీ నేడు ప్రారంభమవుతోంది. దేశవ్యాప్తంగా 6 నగరాల్లో దీనిని నిర్వహించనున్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు జరుగుతాయి.
ఒక మ్యాచ్‌లో 5 సెట్‌లు జరుగుతాయి. లెజెండ్స్, మిక్స్‌డ్ డబుల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, పురుషుల సింగిల్స్‌లుగా ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మార్క్ ఫిలిప్పోసిస్, ప్యాట్ క్యాష్, గ్రెగ్ రుసెద్‌స్కీ, సెర్గీ బ్రుగెయిరా, థామస్ ఎన్‌క్విస్ట్, బగ్దాటిస్, యూజ్నీ, వీనస్ విలియమ్స్, రద్వాన్‌స్కా, హింగిస్‌వంటి విదేశీ ఆటగాళ్లు టోర్నీకి ఆకర్షణ కానుండగా, భారత్ నుంచి పేస్, సోమ్‌దేవ్, సాకేత్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ తదితరులు ఉన్నారు. అదే విధంగా అనుభవం కోసం ప్రతీ జట్టులో భారత జూనియర్ ప్లేయర్లను చేర్చారు. వీరిలో రిషిక, ప్రాంజల, నిధి, సౌజన్య ఉన్నారు.
న్యూఢిల్లీలో సోమవారం ఢిల్లీ డ్రీమ్స్, పంజాబ్ మార్షల్స్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్ ఏసెస్, బెంగళూరు రాఫ్టర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. హైదరాబాద్ జట్టులో మార్క్ ఫిలిప్పోసిస్, మార్టినా హింగిస్, మిఖాయిల్ యూజ్నీ, జీవన్ నెడుంజెళియన్ సభ్యులుగా ఉన్నారు.