Tennis Champions League
-
హైదరాబాద్ విజయం
సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో చెన్నై వారియర్స్‌పై హైదరాబాద్ ఏసెస్ ఆధిపత్యం కొనసాగింది. చెన్నైలో జరిగిన తొలి దశ మ్యాచ్‌లో ఆ జట్టును చిత్తు చేసిన ఏసెస్ రెండో మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. సోమవారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ 5-3, 5-2, 5-4, 5-4, 5-6 (25-19 గేమ్‌ల)తో చెన్నైని చిత్తు చేసింది. ఆదివారం నాగ్‌పూర్ ఆరెంజర్స్ చేతిలో పరాజయం పాలైన ఏసెస్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో చెలరేగారు. ముందుగా లెజెండ్స్ మ్యాచ్‌లో థామస్ జొహన్సన్ 5-3తో రైనర్ షట్లర్‌ను ఓడించి జట్టుకు ఆధిక్యం అందించాడు. మహిళల సింగిల్స్‌లో మార్టినా హింగిస్ 5-2 తో హీతర్ వాట్సన్‌ను చిత్తు చేసి ఆధిక్యాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత మిక్స్డ్ డబుల్స్‌లోనూ హైదరాబాద్ జోడి కార్లోవిచ్-హింగిస్ 5-4తో చెన్నై జంట వెర్డాస్కో-వాట్సన్‌ను ఓడించింది. పురుషుల డబుల్స్‌లో ఏసెస్ ద్వయం కార్లోవిచ్-జీవన్ 5-4తో వెర్డాస్కో-విష్ణువర్ధన్‌లపై గెలవగా... చివరి మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో మాత్రం వారియర్స్ ప్లేయర్ వెర్డాస్కో 6-5తో కార్లోవిచ్‌ను ఓడించి ప్రత్యర్థి ఏకపక్ష విజయాన్ని అడ్డుకున్నాడు. శుక్రవారం నాగ్‌పూర్‌లో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఏసెస్, ఆరెంజర్స్‌తో రెండోసారి తలపడుతుంది. -
హైదరాబాద్ ఏసెస్ పరాజయం
సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌లో హైదరాబాద్‌కు సొంతగడ్డపై ఓటమి ఎదురైంది. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ (టై)లో నాగ్‌పూర్ ఆరెంజర్స్ 3-5, 5-3, 4-5, 5-3, 5-4 (22-20 గేమ్‌ల)తో హైదరాబాద్ ఏసెస్‌ను ఓడించింది. లెజెండ్స్, మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లలో హైదరాబాద్ గెలువగా, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, సింగిల్స్‌లో నాగ్‌పూర్‌కు విజయం దక్కింది. సోమవారం ఏసెస్, చెన్నైతో తలపడుతుంది. హింగిస్, కార్లోవిచ్ ఓటమి ఇద్దరు మాజీ వరల్డ్ నంబర్వన్ల మధ్య జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ముందుగా హింగిస్ ఆధిక్యం కనబర్చినా... ఆ తర్వాత జంకోవిచ్ కోలుకుంది. మొదటి గేమ్‌ను గెల్చుకున్న హింగిస్, జంకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 2-0తో ముందంజ వేసింది. అయితే ఆ వెంటనే బ్రేక్ సాధించడంతో పాటు జంకోవిచ్ సర్వీస్ నిలబెట్టుకోవడంతో స్కోరు 2-2తో సమమైంది. సుదీర్ఘ ర్యాలీలతో హోరాహోరీగా సాగిన ఐదో గేమ్‌ను సొంతం చేసుకొని హింగిస్ మళ్లీ పైచేయి సాధించింది. ఈ దశలో వరల్డ్ నంబర్ 22 క్రీడాకారిణి జంకోవిచ్ ఒక్కసారిగా చెలరేగింది. వరుసగా మూడు గేమ్‌లు గెలిచి సెట్‌ను సొంతం చేసుకుంది. లెజెండ్స్ మ్యాచ్‌లో జొహాన్సన్ 5-3తో అలెక్స్ కొరెట్జాను చిత్తు చేసి ఏసెస్‌కు శుభారంభం అందించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో కార్లొవిచ్-హింగిస్ జోడి 5-4తో లోపెజ్-జంకోవిచ్‌ను ఓడించింది. అయితే పురుషుల డబుల్స్‌లో నాగ్‌పూర్ జోడి లోపెజ్-దివిజ్ 5-3తో కార్లొవిచ్-జీవన్‌పై, పురుషుల సింగిల్స్‌లో లోపెజ్ 5-4తో కార్లొవిచ్పై గెలుపొంది ఆరెంజర్స్కు విజయం ఖాయం చేశారు. -
హైదరాబాద్‌లో నేటి నుంచి సీటీఎల్
ఏసెస్ తరఫున బరిలో హింగిస్ సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) రెండో సీజన్ టోర్నీలో భాగంగా జరిగే మ్యాచ్‌లకు నేటి నుంచి హైదరాబాద్ వేదిక కానుంది. లాల్‌బహదూర్ స్టేడియంలో ఆది, సోమవారాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లో నాగ్‌పూర్ ఆరెంజర్స్‌తో తలపడే హైదరాబాద్ ఏసెస్... మరుసటి రోజు చెన్నై వారియర్స్‌ను ఎదుర్కొంటుంది. హైదరాబాదీ సానియా మీర్జా భాగస్వామి, ప్రపంచ డబుల్స్ రెండో ర్యాంకర్ అయిన మార్టినా హింగిస్ ఈ ఏడాది కూడా ఏసెస్ జట్టు తరఫునే బరిలోకి దిగుతుండటం విశేషం. ఆమెతో పాటు థామస్ జాన్సన్, ఇవో కార్లోవిచ్, జీవన్ నెడుంజెళియన్, ఆదిల్ కళ్యాణ్పూర్, సామ సాత్విక ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను ఒక ‘టై’గా పరిగణిస్తారు. ఈ ‘టై’లో ఐదు సెట్లు ఉంటాయి. ఈ ఐదు సెట్లు వరుసగా లెజెండ్స్ సింగిల్స్, మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్, పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లుగా జరుగుతాయి. ఒక్కో సెట్లో ఐదు గేమ్‌లే ఆడతారు. ఐదు సెట్లు కలిపి ఎక్కువ గేమ్‌లు గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. గ్రూప్ ‘బి’లో భాగంగా చెన్నైతో జరిగి తొలి ‘టై’లో హైదరాబాద్ విజయం సాధించింది. -
ఈసారి టైటిల్ సాధిస్తాం
హైదరాబాద్ ఏసెస్ జట్టు ధీమా జెర్సీ ఆవిష్కరణ చాంపియన్స్ టెన్నిస్ లీగ్ హైదరాబాద్: గతేడాది కంటే ఈసారి మెరుగ్గా రాణించి... చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) టైటిల్‌ను సాధిస్తామని హైదరాబాద్ ఏసెస్ జట్టు యజమాని రాజేశ్ దండు ధీమా వ్యక్తం చేశారు. ‘గతేడాది ఫైనల్ చేరే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్నాం. అయితే ఈసారి మాత్రం అలాంటి ఫలితం పునరావృతం కాదు’ అని తమ జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ ఆధ్వర్యంలో జరిగే చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఈనెల 23న ముంబైలో మొదలయ్యే ఈ లీగ్ డిసెంబరు 6న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. హైదరాబాద్ జట్టులో స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్‌తోపాటు క్రొయేషియా స్టార్ ఇవో కార్లోవిచ్, థామస్ జొహాన్సన్ (స్వీడన్), జీవన్ నెదున్‌చెజియాన్, సామ సాత్విక, ఆదిల్ కల్యాణ్‌పూర్ (భారత్) ఉన్నారు. విజేత జట్టుకు రూ. కోటి, రన్నరప్ జట్టుకు రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీగా ఇస్తారు. -
సీటీఎల్ చాంప్ పుణే మరాఠాస్
న్యూఢిల్లీ: మొదటి చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) టైటిల్‌ను పుణే మరాఠాస్ జట్టు సొంతం చేసుకుంది. బుధవారం ఇక్కడి ఆర్కే ఖన్నా స్టేడియంలో జరిగిన ఫైనల్లో పుణే 27-23 గేమ్‌ల తేడాతో ఢిల్లీ డ్రీమ్స్‌పై విజయం సాధించింది. లెజెండ్స్ మ్యాచ్ మినహా మిక్స్డ్ డబుల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, పురుషుల సింగిల్స్‌లో పుణే విజేతగా నిలవడం విశేషం. చాంపియన్‌గా నిలిచిన మరాఠాస్‌కు రూ. 1 కోటి, రన్నరప్ ఢిల్లీకి రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. ఫైనల్ పోరు తొలి మ్యాచ్ (లెజెండ్స్)లో జువాన్ కార్లోస్ ఫెరీరో 6-3 స్కోరుతో ప్యాట్ క్యాష్‌పై విజయం సాధించి ఢిల్లీకి శుభారంభం అందించాడు. అయితే ఆ తర్వాత వరుసగా పుణేదే పైచేయి అయింది. మిక్స్డ్ డబుల్స్‌లో పుణే జోడి బాగ్దాటిస్-రద్వాన్‌స్కా 6-5తో ఢిల్లీ జంట అండర్సన్-జంకోవిక్లను ఓడించింది. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో రద్వాన్‌స్కా 6-4తో జంకోవిక్‌ను చిత్తు చేసింది. పురుషుల డబుల్స్‌లో అదే ఫలితం ఎదురైంది. బాగ్దాటిస్-సాకేత్ మైనేని ద్వయం 6-5తో అండర్సన్-సనమ్ సింగ్‌పై గెలుపొందింది. ఈ దశలో పుణే 21-20 గేమ్‌ల ఆధిక్యంలో నిలిచి విజయంపై కన్నేసింది. చివరిదైన పురుషుల సింగిల్స్‌లో బాగ్దాటిస్ 6-3తో అండర్సన్‌ను చిత్తు చేయడంలో పుణే టీమ్ సంబరాలు జరుపుకుంది. -
ఫైనల్లో పుణే, ఢిల్లీ
చాంపియన్స్ టెన్నిస్ లీగ్ పుణే: చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టుకు చుక్కెదురైంది. సోమవారం ఇక్కడ జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఏసెస్ 24-25 గేమ్‌ల తేడాతో పుణే మరాఠాస్ చేతిలో ఓటమిపాలైంది. లీగ్ దశ ముగిసిన అనంతరం సౌత్జోన్నుంచి అగ్ర స్థానంలో నిలిచిన పుణే తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్ పోరులో... లెజెండ్స్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు మార్క్ ఫిలిప్పోసిస్ 6-3తో ప్యాట్ క్యాష్‌ను చిత్తు చేశాడు. మిక్స్డ్ డబుల్స్‌లో పుణే జోడి బాగ్దాటిస్-రద్వాన్‌స్కా 6-3 తేడాతో యూజ్నీ-హింగిస్‌పై గెలుపొందింది. మహిళల సింగిల్స్‌లో హింగిస్ (ఏసెస్) 6-4తో రద్వాన్‌స్కాను ఓడించింది. పురుషుల డబుల్స్‌లో బాగ్దాటిస్-సాకేత్ మైనేని 6-3తో యూజ్నీ-జీవన్(ఏసెస్)పై గెలుపొందారు. చివరి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో యూజ్నీ 6-5తో బాగ్దాటిస్ను ఓడించాడు. దీంతో ఇరు జట్లు 24-24 గేమ్‌లతో సమంగా నిలిచాయి. కానీ టైబ్రేక్‌లో బాగ్దాటిస్ను విజయం వరించింది. రేపు జరిగే ఫైనల్లో ఢిల్లీ డ్రీమ్స్‌తో పుణే తలపడుతుంది. -
ఏసెస్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు శుభారంభం చేసింది. సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 27-25 గేమ్‌ల (3-2 మ్యాచ్‌ల) తేడాతో బెంగళూరు రాఫ్టర్స్ను ఓడించింది. మంగళవారం ఇక్కడే జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పుణేను ఎదుర్కొంటుంది. హింగిస్ జోరు: మార్టినా హింగిస్, వీనస్ విలియమ్స్ మధ్య జరిగిన సింగిల్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు మాజీ చాంపియన్లు హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్‌లో హింగిస్ 6-3తో గెలుపొందింది. ముందుగా 3-2తో ఆధిక్యంలో నిలిచిన హింగిస్, ఆరో గేమ్‌ను బ్రేక్ చేసి దూసుకుపోయింది. చివరకు తొమ్మిదో గేమ్‌ను నిలబెట్టుకొని మ్యాచ్ సొంతం చేసుకుంది. అంతకు ముందు లెజెండ్స్ మ్యాచ్‌లో మార్క్ ఫిలిప్పోసిస్ 6-5 (5-2)తో థామస్ ఎన్క్విస్ట్ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో బెంగళూరు జోడి వీనస్ విలియమ్స్-ఫెలీసియానో లోపెజ్ 6-5 (5-1)తో మార్టినా హింగిస్- మిఖాయిల్ యూజ్నీపై విజయం సాధించి పోరును సమం చేశారు. ఆ తర్వాత పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన యూజ్నీ-జీవన్ నెడుంజెళియన్ 6-3తో బెంగళూరు జంట లోపెజ్-రాంకుమార్ రామనాథన్‌ను ఓడించింది. చివరి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో యూజ్నీ (హైదరాబాద్) 4-8తో లోపెజ్ చేతిలో ఓడాడు. ఢిల్లీ విజయం: న్యూఢిల్లీలో జరిగిన మరో మ్యాచ్‌లో ఢిల్లీ డ్రీమ్స్ జట్టు 25-19తో పంజాబ్ మార్షల్స్‌పై గెలిచింది. -
నేటి నుంచి సీటీఎల్ సందడి
బెంగళూరు రాఫ్టర్స్తో హైదరాబాద్ ఏసెస్ ఢీ సాక్షి, హైదరాబాద్: టెన్నిస్‌లో కొత్త తరహా ఫార్మాట్‌తో ముందుకు వచ్చిన చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)కు రంగం సిద్ధమైంది. భారత దిగ్గజ ఆటగాడు విజయ్ అమృత్‌రాజ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ టోర్నీ నేడు ప్రారంభమవుతోంది. దేశవ్యాప్తంగా 6 నగరాల్లో దీనిని నిర్వహించనున్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక మ్యాచ్‌లో 5 సెట్లు జరుగుతాయి. లెజెండ్స్, మిక్స్డ్ డబుల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, పురుషుల సింగిల్స్లుగా ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మార్క్ ఫిలిప్పోసిస్, ప్యాట్ క్యాష్, గ్రెగ్ రుసెద్‌స్కీ, సెర్గీ బ్రుగెయిరా, థామస్ ఎన్క్విస్ట్, బగ్దాటిస్, యూజ్నీ, వీనస్ విలియమ్స్, రద్వాన్‌స్కా, హింగిస్వంటి విదేశీ ఆటగాళ్లు టోర్నీకి ఆకర్షణ కానుండగా, భారత్ నుంచి పేస్, సోమ్‌దేవ్, సాకేత్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ తదితరులు ఉన్నారు. అదే విధంగా అనుభవం కోసం ప్రతీ జట్టులో భారత జూనియర్ ప్లేయర్లను చేర్చారు. వీరిలో రిషిక, ప్రాంజల, నిధి, సౌజన్య ఉన్నారు. న్యూఢిల్లీలో సోమవారం ఢిల్లీ డ్రీమ్స్, పంజాబ్ మార్షల్స్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్ ఏసెస్, బెంగళూరు రాఫ్టర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. హైదరాబాద్ జట్టులో మార్క్ ఫిలిప్పోసిస్, మార్టినా హింగిస్, మిఖాయిల్ యూజ్నీ, జీవన్ నెడుంజెళియన్ సభ్యులుగా ఉన్నారు. -
సీటీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ
ముంబై: కొత్తగా ప్రారంభమవుతున్న చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)... జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లందర్నీ ఒకే తాటిపైకి తెచ్చిందని భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ అన్నాడు. ఈ లీగ్‌లో ఆడేందుకు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. శనివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పేస్... సీటీఎల్ ట్రోఫీని ఆవిష్కరించాడు. సోమవారం నుంచి పోటీలు జరుగుతాయి.