
పంజాబ్ కు షాక్: ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్
హైదరాబాద్: కీలక మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ చతికిలబడింది. నాకౌట్ దశకు చేరుకుని క్రమంలో ఒక్క మ్యాచ్ లో కూడా పరాజయం చవిచూడని పంజాబ్.. సెమీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఘోర ఓటమిని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఛాంపియన్ లీగ్ లో భాగంగా ఇక్కడ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ 65 పరుగుల తేడాతో బొక్కబోర్లాపడింది. చెన్నై విసిరిన 183 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పంజాబ్ ఆదిలోనే వీరేందర్ సెహ్వాగ్(0) వికెట్టును కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం వాహ్రా(16), సాహా (6), మ్యాక్స్ వెల్ (0) వరుస క్యూకట్టడంతో పంజాబ్ తేరుకోలేకపోయింది. స్కోరు బోర్డుపై 50 పరుగులు దాటకుండానే ఆరు వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ కు పరాజయం తప్పలేదు.
పంజాబ్ జట్టులో మిల్లర్(22), ఏఆర్ పటేల్ (31) పరుగుల మినహా ఏ ఒక్క ఆటగాడు ఆకట్టుకోలేదు. కింగ్స్ పంజాబ్ లోఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో జట్టు 18.2 ఓవర్లలో 117 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవిచూసింది. చెన్నై బౌలర్లలో నెహ్రా, శర్మ, రైనా, నేగీ తలో రెండో వికెట్లు తీసి పంజాబ్ పతనాన్ని శాసించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్183 లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై ఆదిలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాలో పడ్డా ప్లెస్సిస్ (46), బ్రేవో(67)పరుగుల చలవతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 182 పరుగులు చేసింది. చివర్లో జడేజా(27)పరుగులతో నాటౌట్ గా మిగిలి మరోసారి ఆకట్టుకున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్-కోల్ కతా తో జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమైంది.