చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి తమ స్థాయిని ప్రదర్శించింది. గత మ్యాచ్ పరాజయం నుంచి వెంటనే కోలుకొని ఢిల్లీని పడగొట్టింది. ముందుగా వాట్సన్ మెరుపు బ్యాటింగ్, చివర్లో ధోని, రాయుడు ధమాకా వెరసి భారీ స్కోరుతో సవాల్ విసరగా... లక్ష్యాన్ని ఛేదించడం డేర్‌డెవిల్స్ వల్ల కాలేదు. రిషభ్ పంత్, విజయ్ శంకర్ పోరాడినా... ఢిల్లీది మళ్లీ పాత కథే అయింది. కెప్టెన్సీ కష్టం శ్రేయస్ అయ్యర్‌కు రెండో మ్యాచ్‌లోనే తెలిసొచ్చింది.
పుణే: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో చెన్నై 13 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షేన్ వాట్సన్ (40 బంతుల్లో 78; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), ధోని (22 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీలకు తోడు అంబటి రాయుడు (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతంగా ఆడాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 198 పరుగులే చేయగలిగింది. రిషభ్ పంత్ (45 బంతుల్లో 79; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), విజయ్ శంకర్ (31 బంతుల్లో 54 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేసినా లాభం లేకపోయింది.
భారీ భాగస్వామ్యాలు...
అద్భుత ఫామ్‌లో ఉన్న రాయుడును బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి పంపి వాట్సన్‌కు జతగా డు ప్లెసిస్ (33 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్)తో చెన్నై ఓపెనింగ్ చేయించింది. బౌల్ట్ వేసిన తొలి బంతికే వాట్సన్ వికెట్ల ముందు దొరికిపోయినా... రీప్లేలో స్పష్టత లేకపోవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడటంతో తొలి 4 ఓవర్లలో చెన్నై 9 పరుగులే చేయగలిగింది. అయితే ప్లంకెట్ వేసిన ఐదో ఓవర్లో వీరిద్దరు కలిసి మూడు భారీ సిక్స్‌లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. ప్లంకెట్ తర్వాతి ఓవర్లో కూడా వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన వాట్సన్, తేవటియా ఓవర్లో కూడా ఇలాగే బాది 25 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు 102 పరుగులు (65 బంతుల్లో) జోడించిన తర్వాత డు ప్లెసిస్‌ను అవుట్ చేసి విజయ్ శంకర్ ఢిల్లీకి తొలి వికెట్ అందించాడు. ఈ భాగస్వామ్యంలో వాట్సన్, ప్లెసిస్ చెరో 33 బంతులు ఎదుర్కోగా... ప్లెసిస్ 33 పరుగులు చేస్తే, వాట్సన్ 66 పరుగులు సాధించడం అతని జోరుకు నిదర్శనం. మ్యాక్స్‌వెల్ తొలి బంతికే రైనా (1)ను బౌల్డ్ చేయడంతో రాయుడు నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. మరోవైపు సీజన్‌లో రెండో సెంచరీ దిశగా దూసుకుపోతున్న వాట్సన్‌ను మిశ్రా అవుట్ చేయడంతో ఢిల్లీ సంబరం చేసుకుంది. అయితే ఆ ఆనందం డేర్‌డెవిల్స్‌కు ఎంతో సేపు నిలవలేదు. ధోని, రాయుుడు కలిసి బౌలర్లను చితక్కొట్టారు. వీరి ధాటికి చివరి 5 ఓవర్లలో చెన్నై 74 పరుగులు రాబట్టడం విశేషం. మిశ్రా బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో దూకుడు మొదలు పెట్టిన ధోని... బౌల్ట్ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టాడు. అదే ఓవర్లో రాయుడు కూడా ఫోర్ బాదడంతో మొత్తం 21 పరుగులు లభించాయి. ప్లంకెట్ వేసిన మరుసటి ఓవర్లో కూడా చెలరేగిన రాయుడు 3 ఫోర్లు కొట్టాడు. 31 పరుగుల వద్ద మున్రో సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ధోని, ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 7 బంతుల్లో 20 పరుగులు సాధించాడు. గత మూడు మ్యాచ్‌లలో రెండు సార్లు రనౌటైన రాయుడు, ఈ మ్యాచ్‌లోనూ రనౌట్‌గా వెనుదిరిగాడు. రాయుడు, ధోని జోడి 36 బంతుల్లోనే 79 పరుగులు జత చేసింది.
రాణించిన పంత్, శంకర్...
భారీ ఛేదనలో ఢిల్లీకి సరైన ఆరంభం లభించలేదు. ఐపీఎల్‌లో తొలిసారి ఆడుతున్న ఆసిఫ్... ముందుగా పృథ్వీ షా (9)ను, ఆ తర్వాత మున్రో (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)ను పెవిలియన్ పంపించాడు. ఆసిఫ్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 6 కొట్టిన మున్రో తర్వాతి బంతికి చిక్కాడు. గత మ్యాచ్ హీరో శ్రేయస్ అయ్యర్ (13) ఎక్కువ సేపు నిలవలేదు. పంత్‌తో సమన్వయ లోపంతో అతను రనౌట్ కాగా... మ్యాక్స్‌వెల్ (6) కూడా విఫలం కావడంతో ఢిల్లీ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో పంత్, శంకర్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు 53 బంతుల్లో 88 పరుగులు జోడించారు. అయితే చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోతున్న దశలో పంత్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ కావడంతో ఢిల్లీ ఆశలు కోల్పోయింది. బ్రేవో వేసిన 19వ ఓవర్లో మూడు భారీ సిక్సర్లు కొట్టడంతో పాటు చివరి వరకు క్రీజ్‌లో నిలిచినా గెలిపించడం విజయ్ శంకర్‌కు సాధ్యం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment