రోజర్స్ సెంచరీ
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా తడబడి పుంజుకుంది. ఓపెనర్ రోజర్స్ (233 బంతుల్లో 101 నాటౌట్; 13 ఫోర్లు) అజేయ సెంచరీకి తోడు వాట్సన్ (68) సమయోచితంగా రాణించడంతో శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 74.4 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులు చేసింది. రోజర్స్‌తో పాటు హాడిన్ (12) క్రీజులో ఉన్నాడు.
ప్రస్తుతం క్లార్క్‌సేన తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 16 పరుగులు వెనుకబడి ఉంది. వార్నర్ (3), ఖాజా (0), క్లార్క్ (6), స్మిత్ (17) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో కంగారు జట్టు 76 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే రోజర్స్, వాట్సన్‌లు ఐదో వికెట్‌కు 129 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. బ్రాడ్‌కు 4, బ్రెస్నన్‌కు ఒక్క వికెట్ దక్కింది. అంతకుముందు 238/9 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ అదే స్కోరు వద్ద రెండు ఓవర్లు ఆడి ఆలౌటైంది. బ్రెస్నన్ (12 నాటౌట్) నిలబడ్డా... అండర్సన్ (16) అవుటయ్యాడు. లియోన్‌కు 4, హారిస్, బర్డ్‌లకు చెరో రెండు వికెట్లు దక్కాయి.
రివ్యూలో అవుట్... కానీ నాటౌట్!
యాషెస్‌లో డీఆర్‌ఎస్ వివాదాలు సృష్టిస్తూనే ఉంది. తాజాగా నాలుగో టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోజర్స్ అవుట్ వివాదాస్పదమైంది. బ్రాడ్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో రోజర్స్ క్యాచ్ అవుటైనట్లు అంపైర్ టోనీ హిల్స్ ప్రకటించారు. దీనిపై బ్యాట్స్‌మన్ రివ్యూ కోరగా... హాట్ స్పాట్‌లో బంతి బ్యాట్ అంచుకు తగల్లేదని స్పష్టమైంది. అయితే బంతి ప్యాడ్‌లను తాకుతూ కీపర్ చేతిలోకి వెళ్లడంతో ఎల్బీడబ్ల్యూ అయినట్లు నిర్ధారణ అయ్యింది. నిబంధనల ప్రకారం క్యాచ్ అవుట్ కోసమే రివ్యూ అడిగారు కాబట్టి అంపైర్... రోజర్స్‌ను నాటౌట్‌గా ప్రకటిస్తూ ఎల్బీడబ్ల్యూని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.