బార్బోడాస్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. తొలి వన్డేలో రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్.. రెండో వన్డేలో 26 పరుగుల తేడాతో ఓటమి చెందింది. వెస్టిండీస్ నిర్దేశించిన 290 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 263 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్(2), బెయిర్ స్టో(0)లు నిరాశపరచడంతో 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత జో రూట్(36) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. దాంతో 60 పరుగులకే 3 వికెట్లు కీలక వికెట్లను చేజార్చుకుంది ఇంగ్లండ్. ఆ దశలో ఇయాన్ మోర్గాన్(70), బెన్ స్టోక్స్(79)లు ఆదుకునే యత్నం చేశారు. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 99 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ గాడిలో పడినట్లు కనిపించింది. కాగా, వీరు ఔటైన తర్వాత బట్లర్(34) ఫర్వాలేదనిపించాడు. అయితే మిగతా వారు విఫలం కావడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. వెస్టిండీస్ బౌలర్లలో షెల్డాన్ కాట్రెల్ ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అతనికి జతగా కెప్టెన్ జాసన్ హోల‍్డర్ మూడు వికెట్లు సాధించాడు. ( ఇక్కడ చదవండి: ఇంగ్లండ్ రికార్డు ఛేదన)
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ గేల్(50) మరోసారి మెరిసి శుభారంభం అందించాడు. ఆపై హెట్‌మెయిర్(104 నాటౌట్) అజేయ శతకంతో రాణించి వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. తొలి వన్డేలో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. 361 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా తమ వన్డే చరిత్రలో ఇంగ్లండ్ ఛేదించిన అత్యధిక స్కోరుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment