
కొలంబో: గత వారం వెలుగులోకి వచ్చిన గాలే స్టేడియం పిచ్ ఫిక్సింగ్‌పై శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ స్పందించారు. ఈ ఉదంతంలో చిన్న చేపలే బలయ్యాయని... పెద్ద చేపలు తప్పించుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తున్న రణతుంగ... తమ దేశ క్రికెట్‌లో అవినీతి తారస్థాయికి చేరిందని, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఘటనలను నిరోధించడంలో ఐసీసీ విఫలమైందంటూ తీవ్రంగా విమర్శించారు. ఇలాంటివి చాలాకాలంగా సాగుతున్నాయని... వీటిపై తప్పనిసరిగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆల్ జజీరా చానెల్ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో గాలే టెస్టులో పిచ్ ట్యాంపరింగ్‌తో పాటు భారత్–ఇంగ్లాండ్, భారత్–ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టుల్లో స్పాట్ ఫిక్సింగ్ చోటుచేసుకున్నట్లు వెల్లడైన సంగతి తెలిసిందే.
దీనిపై ఐసీసీ విచారణ సైతం చేపట్టింది. మరోవైపు గాలే పిచ్ విషయంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ శ్రీలంక ఆటగాడు, సస్పెన్షన్‌కు గురైన గ్రౌండ్స్‌మన్ తరంగ ఇండికా, జిల్లా కోచ్ తరిందు మెండిస్‌లు చాలా చిన్నవారని రణతుంగ వివరించారు. ‘ఇందులో ఓ పెద్ద వ్యక్తి ప్రమేయం ఉంది. అతడిపై చర్యలు తీసుకోవాలి. ఇంత జరుగుతున్నా ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఏం చేస్తోంది? ఇలాంటివి అరికట్టలేకపోతే వారెందుకు? అందుకే కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రతిష్ఠ దెబ్బతింటోంది’ అంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్ చీఫ్‌గా తిరంగా సుమతిపాల హయాంలో వచ్చిన ఆరోపణలనూ ప్రస్తావించారు. ఐసీసీ ఇకపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. రణతుంగ... భారత్–శ్రీలంక మధ్య జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ అయిందంటూ గతేడాది ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment