40 రోజుల్లో రూ. 10 కోట్లు సంపాదిస్తున్నారు
న్యూఢిల్లీ: ప్రస్తుతం యువకులకు క్రికెట్ ఓ కెరీర్ ఆప్షన్ అని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. యువత క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడానికి వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించాడు. ఓ క్రికెటర్ 40 రోజుల్లోనే 10 కోట్ల రూపాయలు సంపాదించగలుగుతున్నాడని పరోక్షంగా ఐపీఎల్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. సోమవారం ఓ కార్యక్రమంలో కపిల్ మాట్లాడుతూ.. క్రికెట్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం రావడం శుభపరిణామనని అన్నాడు. కాలంతో పాటు ప్రపంచ క్రికెట్లో చాలా మార్పులు వచ్చాయని కపిల్ చెప్పాడు.
'పిల్లలకు చదువుపై ఆసక్తి లేకపోతే కనీసం క్రికెట్ ఆడాలి. సచిన్ టెండూల్కర్ లేదా రాహుల్ ద్రావిడ్ వంటి గొప్ప క్రికెటర్ కావాలి' అని కపిల్ అన్నాడు. క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌళిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని, క్రీడలకు సంబంధించిన వస్తువులపై పన్ను తగ్గించాలని కోరాడు. పాఠశాలల్లో తగిన క్రీడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని సూచించాడు.