విన్సెంట్ సమాచారమిచ్చింది నిజమే!
ఫిక్సింగ్‌పై ఐసీసీ ముందే చెప్పిందన్న కివీస్
ఆధారాలు కూడా అందించిన మాజీ క్రికెటర్
వెల్లింగ్టన్: క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌పై ఐసీసీకి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ విశ్వసనీయ సమాచారం ఇచ్చాడన్న విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సీ) ధ్రువీకరించింది. ఈ విషయాన్ని ఐసీసీ తమకు ఎప్పుడో తెలియజేసిందని ఎన్‌జెడ్‌సీ సీఈవో డేవిడ్ వైట్ గురువారం వెల్లడించారు. స్పాట్‌ఫిక్సింగ్ జరిగిన మ్యాచ్‌లు, ఆటగాళ్ల వివరాలను .. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అధికారులకు విన్సెంట్ తెలిపాడంటూ లండన్ టెలిగ్రాఫ్ పత్రిక ఇటీవల కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో వైట్ స్పందించారు.
‘ఆ పత్రికలో వచ్చిన వివరాలు మాకు తెలిసినవే. ఐసీసీ ఈ విషయాన్ని మాకు ముందే చెప్పింది. కాబట్టి వీటి పట్ల మాకు ఎటువంటి ఆశ్చర్యం కలగలేదు’ అని వైట్ అన్నారు. పైగా ప్రస్తుత న్యూజిలాండ్ ఆటగాళ్లపైగానీ, తమ జట్టు ఆడిన మ్యాచ్‌లపైగానీ ఎటువంటి విచారణ జరగడం లేదని స్పష్టం చేశారు. అయితే దక్షిణాఫ్రికాలో 2012లో జరిగిన చాంపియన్స్ లీగ్‌లో భాగంగా తమ దేశవాళీ జట్టు ఆక్లాండ్ ఏసెస్ ఆడిన కొన్ని మ్యాచ్‌లకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లుగా ఐసీసీ తమకు చెప్పినట్లు వైట్ పేర్కొన్నారు. కాగా, దేశవాళీల్లో ఆక్లాండ్ ఏసెస్ తరపున ఆడిన లూ విన్సెంట్.. తనతోపాటు న్యూజిలాండ్ ఆటగాళ్లు క్రిస్ కెయిన్స్, డారిల్ టఫీలపై కూడా విచారణ జరుగుతోందని గత డిసెంబర్‌లో తొలిసారిగా వెల్లడించాడు. ఆ తరువాత తనను కొందరు బుకీలు సంప్రదించినట్లు కూడా తెలిపాడు. అయితే టెలిగ్రాఫ్ పత్రిక మాత్రం ఐసీసీకి విన్సెంట్ ఆధారాలు కూడా ఇచ్చినట్లు పేర్కొంది. ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, హాంకాంగ్, దక్షిణాఫ్రికాల్లో నిర్వహించిన మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ చోటుచేసుకుందని విన్సెంట్ చెప్పినట్లు తెలిపింది.