
వెస్టిండీస్ క్రికెట్‌లో సంక్షోభం!
కొచ్చి: భారత్‌తో తొలి వన్డేకు ముందు వెస్టిండీస్ క్రికెట్ జట్టులో ఒక్కసారిగా సంక్షోభం తలెత్తింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) ఆటగాళ్ల జీతభత్యాల్లో భారీగా కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయం జట్టు ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా ఒక దశలో భారత పర్యటనను బాయ్‌కాట్ చేయాలని క్రికెటర్లు నిర్ణయించారు. మంగళవారం ప్రాక్టీస్‌లో పాల్గొనని ఆ జట్టు బుధవారం చివరి నిమిషం వరకు మ్యాచ్ ఆడుతుందా, లేదా అనేది సందేహంగానే కనిపించింది. చివరకు ప్రాథమిక చర్చల అనంతరం వారు మ్యాచ్ అడారు. అయితే తొలి వన్డే జరిగినా సిరీస్ నిర్వహణపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఆర్థికపరమైన ఈ వివాదం పూర్తిగా ముగియకపోవడమే ఇందుకు కారణం.
భారీగా కోత
జట్టు ఆటగాళ్ల జీతభత్యాలకు సంబంధించి ఇటీవల వెస్టిండీస్ బోర్డు, వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్ (డబ్ల్యూఐపీఏ) మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే అందులో చెప్పిన విధంగా కాకుండా తమకు ఇచ్చే మొత్తంలో భారీగా కోత విధించారని ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నారు. తాజా ఒప్పందం అమల్లోకి వస్తే వారికి రావాల్సిన మొత్తంలో దాదాపు 75 శాతం వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంది. భారత్ చేరుకున్న తర్వాత వారికి ఈ కాంట్రాక్ట్‌లు అందాయి.
దీనిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆటగాళ్లందరి తరఫున వన్డే కెప్టెన్ డ్వేన్ బ్రేవో, డబ్ల్యూఐపీఏ అధ్యక్షుడు వేవెల్ హైండ్స్‌కు లేఖ రాశాడు. కొత్త ఒప్పందం చేసుకునే ముందు హైండ్స్ ఆటగాళ్లతో కనీసం సంప్రదించకుండా, గుడ్డిగా సంతకం చేశారని బ్రేవో ఇందులో ఆరోపించాడు. ‘ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా తీసుకునే ఏ నిర్ణయానికీ మేం కట్టుబడం. ప్రస్తుతం జట్టు సభ్యులంతా తీవ్ర ఒత్తిడిలో, నైరాశ్యంలో ఉన్నారు. కొత్త ఒప్పందంపై మళ్లీ స్పష్టత వచ్చే వరకు వెస్టిండీస్ బోర్డు పాత విధానాన్నే కొనసాగించాలి. ఆటగాళ్ల ప్రయోజనాలను ఏ మాత్రం కాపాడలేకపోయిన హైండ్స్ తదితరులు వెంటనే రాజీనామా చేయాలి’ అని బ్రేవో డిమాండ్ చేశాడు.
చివరకు వెస్టిండీస్ బోర్డు కలుగజేసుకోవడంతో పాటు జట్టులో తీవ్ర చర్చల అనంతరం విండీస్ తొలి వన్డే ఆడేందుకు సిద్ధమైంది. అయితే తొలి మ్యాచ్ ఆడినంత మాత్రాన, సదరు ఒప్పందానికి, షరతులకు తాము అంగీకరించినట్లు కాదని...సమస్య పరిష్కారం కాకపోతే తదుపరి చర్య తీసుకునే హక్కు తమకుందని కూడా బ్రేవో స్పష్టం చేశాడు.