సీఎస్‌కే సారధి ధోనీతో బ్రేవో(పాత ఫొటో)
చెన్నై: మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ సమరానికి అన్ని జట్లూ సమాయత్తం అవుతున్నాయి. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగుతోన్న చెన్నై సూపర్ కింగ్స్ టీమైతే ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్‌ను మొదలుపెట్టింది. గురువారం జరిగిన ఇంటరాక్షన్ ఈవెంట్‌లో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ట్రెనిడాడ్‌కు చెందిన 34 ఏళ్ల డ్వేన్ బ్రేవో కాసేపు మీడియాతో ముచ్చటించాడు.
సీఎస్‌కే జట్టే కాదు..: ‘‘అవును. నేనన్నది నిజమే. నా ఆటతీరునేకాదు వ్యక్తిగత జీవితాన్ని కూడా చెన్నై సూపర్ కింగ్స్ సమూలంగా మార్చేసింది. నావరకు సీఎస్‌కే క్రికెట్ జట్టుకాదు.. చక్కటి కుటుంబం. ఆ ఫ్యామిలీ పెద్ద కెప్టెన్ ఎంఎస్ ధోనీ. అతనితో సాహచర్యం, నిర్దేశకత్వంలో ఆడటం నిజంగా గొప్ప విషయాలు. గడిచిన రెండేళ్లుగా వాటిని మిస్ అయ్యాను. మళ్లీ నా ఫ్యామిలీని కలుసుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది’’ అని భావోద్వేగానికి గురయ్యాడు బ్రేవో. తన అభిమానుల్లో అత్యధికులు చెన్నైవారేనని గుర్తుచేశాడు.
విండీస్ ప్లేయర్ల స్పెషాలిటీ అదే: ఐపీఎల్ ఒక్కటేకాదు క్రికెట్‌కు సంబంధించి ఏ ఈవెంట్ అయినా వెస్టిండీస్ ప్లేయర్లుంటే ఆ మజానే వేరన్నది తెలిసిందే. అంతటి ప్రత్యేకత ఏమిటని విలేకర్లు అడిగిన ప్రశ్నకు బ్రేవో ఇలా సమాధానమిచ్చాడు.. ‘‘ప్రతిఒక్కరూ జీవితాన్ని ఆస్వాదిస్తారు. టీమిండియా ఆటగాళ్ల అంతఃప్రేరణ నన్ను ఆకట్టుకుంటుంది. టీ20లు వచ్చాక చాలామంది ఆటగాళ్లు లైమ్‌లైట్‌లోకి వచ్చారు. భయసంకోచాలు లేకుండా ఆడటమేకాదు గేమ్‌లోని ఫన్‌ను నూరుశాతం ఎంజాయ్‌చేస్తున్నారు. స్టేడియంలో అభిమానులను ఆకట్టుకునేవి ఇవే. క్రిస్ గేల్, పొలార్డ్, సునీల్ నరైన్, డారెన్ సామి, నేను వాటిలో ముందుంటాం. విండీస్ ప్లేయర్లు సహజంగానే మంచి ఎంటర్‌టైనర్లు అన్నది వాస్తవం.
వరల్డ్ కప్‌లో ఆడతా: దిగ్గజ జట్టుగా వెలుగొందిన వెస్టిండీస్ ఇవాళ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ ఆడాల్సిన పరిస్థితి నెలకొనడంపై బ్రావో తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ‘‘దిగ్గజ ఇటలీ జట్టు లేకుండానే ఈ ఏడాది ఫుట్‌బాల్ (ఫిఫా) వరల్డ్ కప్ జరుగనుంది. ఆటల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? అవును, ప్రపంచ కప్‌కు వెస్టిండీస్ దూరమవుతుందేమోనని నేనూ బాధపడ్డా. కానీ మా వాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో క్వాలిఫయర్స్‌లో నెగ్గారు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో విండీస్ టీమ్‌లో నేనూ ఆడతానన్న నమ్మకం ఉంది’’ అన్నాడు బ్రేవో.
Comments
Please login to add a commentAdd a comment