ధోనీ ఎప్పుడూ ఆ ఛాన్స్ ఇవ్వడు
కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యాన్ని చాంపియన్స్ ట్రోఫీ నిర్ణయిస్తుందని అతని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ అన్నాడు. ప్రస్తుతం ధోనీ ఈ ఈవెంట్‌పైనే పూర్తిగా దృష్టిసారిస్తున్నాడని, ఈ టోర్నీలో రాణిస్తే 2019 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడుతాడని చెప్పాడు.
కెప్టెన్సీతో పాటు టెస్టులకు గుడ్ బై చెప్పిన ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. ధోనీ ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో రాణించాడు. మరో మూడు నెలల్లో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వయసు పెరిగేకొద్దీ ఒకేలా ఆడటం సాధ్యంకాదని, అయితే మనోబలం, ఆటను విశ్లేషించే తత్వం వంటి లక్షణాలు ధోనీని ప్రత్యేక క్రికెటర్‌ను చేశాయని బెనర్జీ చెప్పాడు. ధోనీ ఎప్పుడూ ఇతరులకు వేలెత్తి చూపే అవకాశం ఇవ్వడని, ఆ పరిస్థితి రాకముందే టెస్టుల నుంచి వైదొలిగాడని గుర్తుచేశాడు. టెస్టుల నుంచి ధోనీ రిటైరయినపుడు ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు గాని, బెస్ట్ ఫ్రెండ్స్‌కు గాని తెలియదని చెప్పాడు. కాగా ఐపీఎల్ జట్టు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ కెప్టెన్సీ నుంచి ధోనీని తొలగించడం బాధాకరమని బెనర్జీ అన్నాడు. ధోనీ చిన్నప్పుడు ఎంత క్రమశిక్షణ, సమయపాలనతో ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడని చెప్పాడు.