ఏం చేయాలో మాకు తెలుసు
జట్టులో సమస్యలు ఉన్నాయి
కానీ అధిగమించే సత్తా ఉంది
రెండు వార్మప్ మ్యాచ్‌లు కీలకం
భారత కెప్టెన్ ధోని వ్యాఖ్య
ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టి రెండు నెలలు గడిచినా ఒక్క విజయాన్నీ రుచి చూడలేదు. ఒక్క ఆటగాడు కూడా ఫామ్‌లో కనిపించడం లేదు. అన్ని విభాగాల్లోనూ సమస్యలు... అయినా ఇవన్నీ ఆటలో భాగమనే అంటున్నాడు భారత కెప్టెన్ ధోని. ఏం చేస్తే ప్రపంచకప్ గెలుస్తామో తమకు తెలుసని, చాంపియన్స్ ట్రోఫీ సమయంలో ఇంతకంటే గడ్డు స్థితిని అధిగమించి టైటిల్ గెలిచామని చెబుతున్నాడు. ప్రపంచకప్‌కు ముందు వివిధ అంశాలపై భారత కెప్టెన్ చెప్పిన సంగతులు అతని మాటల్లోనే...
ప్రస్తుతం నేను దేశం తరఫున ఓ బాధ్యతతో ఉన్నాను. మిగిలినవి ఏవైనా మనకోసం ఎదురుచూస్తాయి. ప్రపంచకప్ అనేది అన్నింటికంటే ముఖ్యమైన అంశం. ఇది ముగిశాక కూడా నా కూతుర్ని చూసుకోవచ్చు.
బ్యాటింగ్ బాగోలేదు: ప్రస్తుతం మా బ్యాట్స్‌మెన్ ఫామ్ బాగోలేదు. ఆటలో స్థిరత్వం లోపించింది. కాబట్టి వికెట్లు కాపాడుకుని ఆఖరి ఓవర్లలో భారీగా పరుగులు చేయడమే ఈసారి ప్రపంచకప్‌లో మా వ్యూహం. పరిస్థితిని బట్టి బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేస్తాం.
మధ్య ఓవర్లు కీలకం: బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ మధ్య ఓవర్లు చాలా కీలకం. మధ్య ఓవర్లలో పరుగులు రాకుండా చూస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలుగుతాం. అదే విధంగా మా బ్యాట్స్‌మెన్ సింగిల్స్ ద్వారా రన్‌రేట్‌ను, వికెట్లను కాపాడుకోవాలి.
మాకిది అలవాటే: ఐసీసీ టోర్నమెంట్స్‌కు ముందు మాకు ఇబ్బందులు మామూలే. చాంపియన్స్ ట్రోఫీలో ఇంతకంటే గడ్డు పరిస్థితుల మధ్య ఇంగ్లండ్ వెళ్లాం. కానీ విజయంతో తిరిగి వచ్చాం. ఆ టోర్నీలో మేం నిలకడగా ఆడాం. ఇప్పుడూ అదే స్ఫూర్తితో రాణిస్తాం.
పాకిస్తాన్‌తో మ్యాచ్: ఆస్ట్రేలియాతో, శ్రీలంకతో లేదా మరో దేశంతో ఎవరితో అయినా మ్యాచ్ ఒక్కటే. పాక్‌తో మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడి పెంచుకోవడం అనవసరం.
వార్మప్ మ్యాచ్‌లు కీలకం: ముక్కోణపు టోర్నీలో ఏం జరిగిందనేది అనవసరం. అది గతం. దానిని మార్చలేం. ఇప్పడు ప్రపంచకప్‌కు ముందు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ రెండింటినీ బాగా వినియోగించుకోవాలి. ఆ రెండు మ్యాచ్‌లు చూసిన తర్వాతే తుది జట్టుపై స్పష్టత వస్తుంది.
విశ్రాంతితో కొత్త ఉత్సాహం: వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌లు, వన్డే సిరీస్ ఆడటం అంటే పనిభారం బాగా పెరిగినట్లే. అందుకే కొంత విశ్రాంతి అవసరం అని భావించింది. ఈ ఐదు రోజుల తర్వాత ఆటగాళ్లలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
అన్ని జట్లూ బాగున్నాయి: ఈసారి ప్రపంచకప్‌లో అన్ని జట్లూ సమతూకంతో కనిపిస్తున్నాయి. అందరికీ ఈ కప్ ప్రత్యేకమే. ఎవరు నిలకడగా ఆడతారు? నాకౌట్ దశలో ఎలాంటి ప్రదర్శన ఉంటుందనేది కీలకం. చాలా జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లలో సరిగా ఆడవు. ప్రపంచకప్ లాంటి టోర్నీలో మాత్రం బాగా ఆడతాయి.
అంచనాలు సహజం: ప్రపంచకప్ సమయంలో సహజంగానే అభిమానుల్లో అంచనాలు పెరుగుతాయి. కానీ దాని గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్లలేం. సరైన ప్రణాళికలు రచించి, వాటిని అమలు చేయాలి. గెలవాలంటే ఏం చేయాలో మాకు తెలుసు. దానిని సమర్థంగా ఆచరణలో పెడతామనే నమ్మకమూ ఉంది.
ఆ రెండు జట్లపై మరింత ఒత్తిడి: 2011 ప్రపంచకప్‌లో మాపై విపరీతమైన ఒత్తిడి ఉంది. ఆతిథ్య దేశంలో సహజంగానే ఇది ఎక్కువ. ఈసారి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అలాంటి స్థితిని ఎదుర్కొంటాయి. అయితే ఇక్కడ సంస్కృతి వేరు. అభిమానులు గెలుపోటములను ఒకేలా తీసుకుంటారు.
దేశమే ముందు: నాకు కూతురు పుట్టింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. నేనెందుకు భారత్ వెళ్లలేదు అని అడుగుతున్నారు. ప్రస్తుతం నేను దేశం తరఫున ఓ బాధ్యతతో ఉన్నాను. మిగిలిన ఏవైనా మనకోసం ఎదురుచూస్తాయి. ప్రపంచకప్ అనేది అన్నింటికంటే ముఖ్యమైన అంశం. ఈ టోర్నీ ముగిశాక కూడా నా కూతుర్ని చూసుకోవచ్చు, సమయం గడపొచ్చు.
చాంపియన్స్ ట్రోఫీలో ఇంతకంటే గడ్డు పరిస్థితులు మధ్య ఇంగ్లండ్ వెళ్లాం. కానీ విజయంతో తిరిగి వచ్చాం.