
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ విజయం సాధించింది. జోన్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 48–35తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను చిత్తుచేసింది. రైడింగ్‌తో పాటు ట్యాక్లింగ్‌లోనూ ఆకట్టుకున్న ఢిల్లీ గెలుపొందగా... కేవలం రైడింగ్‌నే నమ్ముకున్న జైపూర్ చతికిలపడింది. ఢిల్లీ తరఫున మిరాజ్ షేక్ 15 రైడ్ పాయింట్లతో విజృంభించగా... నవీన్ కుమార్, చంద్రన్ రంజిత్ చెరో 9 పాయింట్లతో అతనికి చక్కటి సహకారం అందించారు.
జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున దీపక్ హుడా 20 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. మ్యాచ్ తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 29–10తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిన ఢిల్లీ ఆ తర్వాత ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ విజయం సొంతం చేసుకుంది. పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 35–35తో డ్రాగా ముగిసింది. నేడు జరిగే మ్యాచ్‌లో యు ముంబాతో దబంగ్ ఢిల్లీ తలపడనుంది.