
బీసీసీఐ సాయం కోరిన కనేరియా
కరాచీ: గత ఐదు సంవత్సరాల క్రితం ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్ లో ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన పాకిస్తాన్ స్పిన్నర్ డానిష్ కనేరియా తన దేశ క్రికెట్ బోర్డు నుంచి ఎటువంటి సాయం అందకపోవడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)ని ఆశ్రయించాడు. తనపై నిషేధం ఎత్తివేయడానికి బీసీసీఐ సాయం చేయాలని తాజాగా విజ్ఞప్తి చేశాడు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తో భారత క్రికెట్ బోర్డు చర్చించి తనకు నిషేధం నుంచి విముక్తి కల్పించాలని విన్నవించాడు. తన ఆర్థిక పరిస్థితి బాలేనందున శిక్ష సందర్భంగా పడ్డ జరిమానా కూడా తాను చెల్లించే స్థితిలో లేనని కనేరియా ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
తాను ఫిక్సింగ్ కు పాల్పడినట్లు భారత్ మీడియాలో అప్పట్లో వక్రీకరించి పెద్ద ఎత్తున దుమారం చెలరేగినా, దానిపై ఇప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నాడు. ఆ సమయంలో భారత్ మీడియా అత్యుత్సాహం చూపడం తనను ఎక్కువగా బాధించిందన్నాడు.
ఇదిలా ఉండగా, కనేరియా అన్నయ్య వికీ మాట్లాడుతూ.. తన కుటుంబం పాకిస్తాన్ క్రికెట్ ను కిందికి తోసే పని ఏనాటికీ చేయదన్నాడు. గతంలో ఫిక్సింగ్ పాల్పడిన ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లకు నిషేధం అనంతరం జాతీయ జట్టులో పునరాగమనం కల్పించినట్లే కనేరియాపై కూడా నిషేధం ఎత్తివేయడానికి పీసీబీ సహకరించాలన్నాడు. 2010 నుంచి కనేరియా చాలా క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడని వికీ తెలిపాడు. ఆర్థికంగా కూడా తమ పరిస్థితి చిన్నా భిన్నంగా మారిందన్నాడు. కనేరియా మొత్తం అకౌంట్లను స్తంభింపజేయడంతో ఉమ్మడి కుటుంబమైన తమ పరిస్థితి అద్వానంగా ఉందని వికీ తెలిపాడు.
2010లో ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కనేరియా ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంగ్లండ్‌లో కోర్టును ఆశ్రయించి గతంలో భంగపడ్డాడు. ఫిక్సింగ్ చేసినందుకు, తమను కోర్టుకు పిలిచినందుకు ఖర్చులకు గాను అన్నీ కలిపి కనే రియా తమకు రూ. 2.5 కోట్లు చెల్లించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంతో కనేరియా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వచ్చింది.