పెషావర్ జల్మీ కెప్టెన్ డారెన్ స్యామీ
షార్జా: గాయంతో బాధపడుతూ క్రీజులోకి దిగినా భారీ హిట్టింగ్‌తో జట్టును గెలిపించాడు పెషావర్ జల్మీ కెప్టెన్ డారెన్ స్యామీ. గురువారం సాయంత్రం జరిగిన ఉత్కంఠపోరులో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుపై పెషావర్‌ను విజేతగా నిలిపాడు స్యామీ. గాయంతో ఉన్న స్యామీ ఏం ఆడతాడులే అనుకుంటే భారీ షాట్లతో ఏకంగా మ్యాచ్‌నే దూరం చేశాడు. పాకిస‍్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో భాగంగా పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లాడి 142 పరుగులు చేసి పెషావర్‌కు ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్ధేశించింది. 143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన డారెన్ స్యామీ జట్టు తొలుత బాగానే పరుగులు సాధించినా చివర్లో ఒత్తిడికి లోనైంది.
తమీమ్ ఇక్బాల్-మహ్మద్ హఫీజ్ లు 54 పరుగుల భాగస్వామ్యం అనంతరం పెషావర్ టీమ్ వికెట్ కోల్పోయింది. పరుగులు రాకపోవడం, వికెట్ పడటంతో స్యామీ సేన విజయానికి 7 బంతుల్లో 16 పరుగులు కావాలి. ఎడకాలికి గాయంతో బాధపడుతున్నా స్యామీ క్రీజులోకి వచ్చాడు. 19వ ఓవర్ చివరి బంతికి సిక్సర్ బాది పెషావర్‌లో ఆశలు నింపాడు. గ్లాడియేటర్ బౌలర్ అన్వర్ అలీ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతిని సిక్సర్‌గా మలిచిన స్యామీ, నాలుగో బంతిని లాంగాఫ్ దిశగా ఫోర్ కొట్టగానే సంబరాలు మొదలయ్యాయి. కేవలం 4 బంతులాడిన కెప్టెన్ స్యామీ 2 సిక్సర్లు, ఫోర్ బాది 16 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పెషావర్ జల్మీ నాలుగో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment