బీజింగ్: ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ ప్రపంచాన్ని ఇప్పుడు ఊపేస్తోంది. ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్‌లు.. యువఆటగాళ్ల మెరుపు గోల్స్... సీనియర్లు నిరుత్సాహపరచటం... ఇలా ఊహించని పరిణామాలు ప్రేక్షకులకు మజాను పంచుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌పై ఫుట్‌బాల్ ఐకాన్, ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హమ్(43) స్పందించాడు. ఫైనల్‌లో ఇంగ్లాండ్ వర్సెస్ అర్జెంటీనా మ్యాచ్ జరగాలన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
చైనాలో ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న బెక్‌హమ్.. ఇంగ్లాండ్ తొలివిజయంపై(ట్యూనీషియాపై 2-1 తేడాతో) స్పందిస్తూ... ‘ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకోవాలి. అక్కడ అర్జెంటీనాతో తలపడాలి. ఆ రెండూ పోటాపోటీగా ఆడుతుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అఫ్‌కోర్స్ ఇందుకోసం ఇంగ్లాండ్ టీం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ దఫా చాలా బలమైన జట్లు కనిపిస్తున్నాయి. కానీ, నేను కోరుకునేది మాత్రం ఫైనల్‌లో ఈ రెండు జట్టు ఆడాలనే. ఎందుకంటే ఇంగ్లాండ్ నా జట్టు కాబట్టి’ అని బెక్‌హమ్ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో యువ సభ్యులే ఎక్కువగా ఉన్నారని, పైగా వారిలో చాలా మందికి ప్రపంచ కప్ ఆడిన అనుభవం కూడా లేదని ఆయన అంటున్నాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయొద్దని, కఠోరశ్రమతో ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఈ దిగ్గజం చెబుతున్నాడు.
ఇంగ్లాండ్ జట్టు 1966లో ఫిఫా కప్‌ను గెల్చుకున్న ఇంగ్లాండ్ టీం ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శనను కొనసాగించలేదు. చివరిసారిగా బెక్‌హమ్ సారథ్యంలోనే ఇంగ్లాండ్ 2006 ఫిఫా వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్ దాకా వెళ్లగలిగింది. అయితే అర్జెంటీనాతో బెక్‌హమ్ ఆడిన ఓ రెండు మ్యాచ్‌లు మాత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. 1998లో ఫ్రాన్స్‌లో జరిగిన ఫిఫా టోర్నీలో అర్జెంటీనా-ఇంగ్లాండ్ మ్యాచ్ సందర్భంగా రెడ్ కార్డ్ ద్వారా బెక్‌హమ్ మైదానం వీడాల్సి వచ్చింది. అయితే 2002 ఫిఫా టోర్నీ మ్యాచ్‌లో మాత్రం పెనాల్టీ గోల్ ద్వారా ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించిన అర్జెంటీనాపై బెక్‌హమ్ ప్రతీకారం తీర్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment