భారత క్రికెట్‌కు వన్నె తెచ్చిన ఆటగాళ్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముందు వరుసలో ఉంటాడనేది కాదనలేని వాస్తవం. సచిన్ క్రికెట్ శకంలో అతని కోసమే మ్యాచ్‌లు చూసే వారు కోకొల్లలు. అభిమానుల్ని స్టేడియాలకు రప్పించాలన్నా, టీవీలు ముందు అతుక్కుపోయేలా కూర్చోబెట్టాలన్నా అది సచిన్‌కే సాధ్యమైంది. రెండు దశాబ్దాలుగా పైగా క్రికెట్ ఆడి తనకంటూ ప్రత్యేక ముద‍్రను సంపాదించుకున్న క్రికెటర్ సచిన్. సరిగ్గా 29 ఏళ్ల క్రితం ఇదే రోజున (నవంబర్15) సచిన్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కరాచీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్ తొలి మ్యాచ్ ఆడాడు. 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్.. అతి పిన్నవయసులో ఆ ఘనత సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరకుండా సచిన్ పేరిటే ఉండటం ఇక్కడ మరొక విశేషం.
టెస్టుల్లో, వన్డేల్లో కలిపి వంద సెంచరీలు నమోదుచేసిన సచిన్ టెండూల్కర్ ఆ ఘనత సాధించిన తొలి, ఏకైక క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. వన్డేల్లో మొట్ట మొదటి డబుల్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్ కూడా సచినే. టెస్టులు, వన్డేల్లో కలిపి 30,000 వేలకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్ సచిన్. 259 ఇన్నింగ్స్‌లో వన్డేల్లో పది వేల పరుగులు పూర్తిచేసిన సచిన్... ఆ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు. అతితక్కువ ఇన్నింగ్స్‌లో 259 ఇన్నింగ్స్‌లో 10 వేల పరుగుల ఫీట్ సాధించిన రికార్డు కూడా కొన్ని రోజుల క్రితం వరకూ సచిన్ పేరిటే ఉండేది... తాజాగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఆ మార్క్‌ను 205 ఇన్నింగ్స్‌ల్లో అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించాడు.
తన కెరీర్‌లో ఆరు వన్డే వరల్డ్‌కప్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్... ఈ మెగాటోర్నీలో అత్యధికసార్లు పాల్గొన్న క్రికెటర్‌గా నిలిచాడు. 24 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్ కొనసాగించిన ఈ దిగ్గజ ఆటగాడు 2013లో నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ తర్వాత తన క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తన క్రికెట్ అరంగేట్రపు రోజును గుర్తు చేసుకున్న సచిన్.. భారత్ జట్టుకు ప‍్రాతినిథ్యం వహించడాన్ని చిరస్మరణీయంగా పేర్కొన్నాడు. సుదీర్ఘకాలం భారత జట్టు తరపున ఆడే అవకాశం రావడం ఒక అరుదైన గౌరవమన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment