నీకేమైనా బ్రెయిన్ ఫేడ్ అయ్యిందా?
చెన్నై: ఆస్ట్రేలియన్లు గెలుపు కోసం ఏమైనా చేస్తారు. ఈ విషయం చాలాసార్లు రుజువైంది కూడా. ఈ క్రమంలోనే ఓటమిని మాత్రం అస్సలు జీర్ణించుకోలేరు. ఎక్కడైనా మాకు మేము సాటి అన్నచందంగా వ్యవరిస్తారు. తాజాగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ కు ఎదురైన ఓటమిని ఆ దేశ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ తేలిగ్గా తీసుకోలేకపోయారు. అలాగని ఆసీస్ క్రికెటర్ల పేలవ ప్రదర్శనను ఏమీ అనకపోగా, భారత్ గెలుపుకు వర్షమే కారణమంటూ సరికొత్త పల్లవి అందుకున్నారు. 'నా వరకూ అయితే టీమిండియా గెలుపుకు వర్షం సహకరించింది. వారు విజయం సాధించాలంటే వర్షం పడాలేమో. అయినా ఫర్వాలేదు. ఇక రెండో గేమ్ తో ఆసీస్ విజయాల బాట పట్టాలి' అంటూ టీమిండియా విజయాన్ని తక్కువ చేశారు.
దీనిపై భారత అభిమానులు మండిపడుతున్నారు. నీకేమైనా బ్రెయినక్ ఫేడ్ అయ్యిందా?, గతంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆసీస్ క్రికెటర్లు తొండాటను ఆ దేశ మాజీలు సమర్దించారు. అప్పుడు ఆసీస్ క్రికెటర్లకి బ్రెయిన్ ఫేడ్ అయ్యింది. ఇప్పుడు మరో ఆస్ట్రేలియన్ ఆ జాబితాలో చేరిపోయాడు' అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, వర్షం అనేది రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకే ఎక్కువ ఉపయోగపడుతుంది. నువ్వు కొంత క్రికెట్ జ్ఞానాన్ని తెలుసుకోవాల్సి ఉంది. తెలుసుకోలేక పోతే చాలా కష్టం 'అని మరొక అభిమాని చమత్కరించారు. 'నువ్వు కనుక ఫుట్ బాల్ ఆడినట్లయితే చాలా గొప్ప డిఫెండర్ కావడం ఖాయం' అని మరొక వ్యక్తి విమర్శించారు.