'త్వరలో పాక్ తో సిరీస్ పై నిర్ణయం'
ముంబై: టీమిండియా-పాకిస్థాన్ ల మధ్య డిసెంబర్ లో జరగాల్సిన ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తాజాగా స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య జరగాల్సిన సిరీస్ పై అభిమానులు చాలా కాలం నుంచి నిరీక్షిస్తున్నా దానిపై సందిగ్ధత మాత్రం కొనసాగుతూనే ఉంది. దీనిపై గురువారం బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సిరీస్ కు సంబంధించి అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోసారి రెండు దేశాల క్రికెట్ బోర్డులు చర్చలు జరిపిన అనంతరం సిరీస్ పై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ద్వైపాకిక్ష సిరీస్ తటస్థ వేదికపై రెండు బోర్డులు ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఇరు దేశాల మధ్య అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ జరగాలంటే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ), ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఆమోదం తప్పనిసరి అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం ఐసీసీకి వద్దకు చేరడంతో తప్పకుండా పరిష్కారం దొరికే అవకాశం ఉందన్నారు.
టీమిండియా-పాకిస్థాన్ ల క్రికెట్ సిరీస్ డిసెంబర్ లో యూఏఈలో జరగాల్సి ఉంది. కాగా, యూఏఈలో ఆడటానికి బీసీసీఐ విముఖత వ్యక్తం చేయడంతో పాటు ఆ సిరీస్ ను భారత్ లో జరపాలని భావించింది. ఆ మేరకు ప్రయత్నాలు కూడా చేసింది. అయితే అందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అంగీకరించలేదు. ఆ సిరీస్ ను భారత్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడబోమని తెగేసి చెప్పేసింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం యూఏఈలో మాత్రమే ఆడతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి పీసీబీతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ యోచిస్తోంది.