'మేము కూడా బాయ్కాట్ చేస్తున్నాం'
కరాచీ:ఇప్పటివరకూ భారత-పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరుగుతాయని ఆశించిన సగటు క్రికెట్ అభిమానికి ఇది నిజంగా చేదు వార్తే. ఇప్పటికే పాక్తో ఎటువంటి క్రికెట్ సంబంధాలు కొనసాగించాలని అనుకోవడం లేదని బీసీసీఐ స్పష్టం చేయగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కూడా అదే బాటలో పయనిస్తోంది. తాము కూడా భారత్తో ద్వైపాక్షిక సిరీస్లను కోరుకోవడం లేదని తాజాగా పేర్కొంది. ఈ మేరకు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ ఓ ప్రకటనలో భారత్తో మ్యాచ్లు ఆడే ఉద్దేశం తమకు కూడా లేదని తెగేసి చెప్పారు.
ఇక నుంచి భారత్తో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించదలచిన ఈవెంట్లను బహిష్కరిస్తున్నట్ల షహర్యార్ పేర్కొన్నారు. తమ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగిన పక్షంలో ఇరు బోర్డులకు ఆర్థికపరమైన లాభాలు మాత్రమే ఉంటాయన్నారు. ఇది సమయంలో తమ మధ్య సిరీస్లు జరగ్గాపోతే అది క్రికెట్ క్రేజ్ను తగ్గిస్తుందనడంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. భారత్తో మ్యాచ్లను బాయ్కాట్ చేసిన తరుణంలో తాము కొన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే మాట నిజమేనన్నారు. కాకపోతే భారత్తో మ్యాచ్లను బహిష్కరించడం ఒక్కటే తమ ముందున్న కార్యాచరణ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా, భారత్ తో ఆడేందుకు పాకిస్తాన్ హాకీ సమాఖ్య తీసుకున్న నిర్ణయంతో తమకు ఎటువంటి సంబంధం లేదని షహర్యార్ అన్నారు. వారి అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం తమకు లేదన్నారు.