ద్వైపాక్షిక సిరీస్ పై పాక్ ఆశలు!
కరాచీ: టీమిండియా-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య యూఏఈలో డిసెంబర్ లో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ పై ఇంకా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ఆశలు వదులుకోలేదు. పాకిస్థాన్-టీమిండియాల మధ్య సిరీస్ జరుగుతుందని తాము భావిస్తున్నామని పీసీబీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు నజాం సేథీ తెలిపారు. ముంబైలో ఘటన అనంతరం ద్వైపాక్షిక సిరీస్ జరగదనే సంకేతాలు వెళ్లిన క్రమంలో సేథీ స్పందించారు. తమతో మ్యాచ్ లు వద్దనుకుంటే ముంబైలో చర్చలకు పాక్ బోర్డు అధికారుల్ని ఎందుకు పిలుస్తారని జియో సూపర్ చానెల్ తో మాట్లాడిన ఆయన ప్రశ్నించారు. రెండు దేశాల మధ్య సిరీస్ పై తాము ఇంకా ఆశలు వదులుకోలేదన్నారు.
ఇరుదేశాల క్రికెట్ సిరీస్ లో భాగంగా పీసీబీతో మరోసారి జరుపుతామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేయడం కూడా అందుకు మరింత బలాన్నిస్తుంది. అక్టోబరు 25 తర్వాత ఇరు బోర్డుల అధ్యక్షులు చర్చలు జరుపుతారని ఆయన పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇరు బోర్డుల అధ్యక్షులు సమావేశమై సిరీస్ గురించి చర్చిస్తారని శుక్లా పేర్కొన్న సంగతి తెలిసిందే.