ఒడెన్స్ (డెన్మార్క్): ఈ ఏడాది మరోసారి సైనా నెహ్వాల్ నిరాశ పరిచింది. డెన్మార్క్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోనే చేతులెత్తేసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గురుసాయిదత్ కూడా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. ఫలితంగా డెన్మార్క్ ఓపెన్‌లో భారత పోరాటం ముగిసింది. 66 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సైనా 21-13, 18-21, 19-21తో ఆరో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి పాలైంది.
గతంలో సుంగ్ జీ హున్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఐదోసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో విఫలమైంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా 16-13తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ తర్వాత అనవసర తప్పిదాలు చేసి మ్యూలం చెల్లించుకుంది. రెండుసార్లు వరుసగా మూడు పాయింట్ల చొప్పున ప్రత్యర్థికి కోల్పోయి పరాజయాన్ని ఖాయం చేసుకుంది. మొత్తానికి సైనా ఖాతాలో ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా ఇంకా చేరలేదు. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గురుసాయిదత్ 11-21, 19-21తో మూడో సీడ్ డూ పెంగ్యూ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. రెండేళ్ల క్రితం హాంకాంగ్ సూపర్ సిరీస్ టోర్నీలో డూ పెంగ్యూను ఓడించిన గురుసాయిదత్ ఈసారి మాత్రం నిరాశపరిచాడు.
సైనాకు చుక్కెదురు
Published Sat, Oct 19 2013 12:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement