సైనాకు తొలి పరీక్ష
కౌలాలంపూర్: గతేడాది వరుస వైఫల్యాలతో నిరాశపరిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఈ సీజన్‌లో తొలి పరీక్షకు సిద్ధమైంది. పూర్తి ఫిట్‌నెస్ లేక ఈ ఏడాది తొలి సూపర్ సిరీస్ టోర్నీ కొరియా ఓపెన్‌కు దూరమైన ఆమె... మలేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలోకి దిగుతోంది. మంగళవారం ప్రారంభమయ్యే ఈ టోర్నీలో తొలి రోజు క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగుతోన్న హైదరాబాదీ స్టార్ బుధవారం జరిగే మెయిన్ డ్రా తొలి రౌండ్ పోరులో ఇండోనేసియాకు చెందిన హిరా దేసితో తలపడనుంది.
గతేడాది ఆమెకు పూర్తిగా చేదు అనుభవాల్నే మిగిల్చిన సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్ సమస్యలతో పాటు వరుస వైఫల్యాలు ఆమెను వెంటాడాయి. దీంతో ఆమె ఈసారి ఫిట్‌నెస్‌కు అమిత ప్రాధాన్యమిచ్చి కసరత్తు చేసింది. ఇప్పుడు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సంతరించుకున్న ఆమె ఈ సీజన్‌ను గెలుపుతో ఆరంభించాలని భావిస్తోంది. అయితే ఈ టోర్నీలో ఆమెకు చైనీయులతో పెను సవాళ్లే ఎదురవనున్నాయి. 23 ఏళ్ల సైనాకు లీ జురుయ్, యిహాన్ వాంగ్‌ల రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థులు ఎదురవనున్నారు.
తొలి రౌండ్‌ను అధిగమిస్తే ఈ హైదరాబాదీ... రెండో రౌండ్‌లో ప్రపంచ 30వ ర్యాంకర్ యా జుయ్ (చైనా)ని ఢీకొంటుంది. ఏపీ రైజింగ్ స్టార్ పి.వి. సింధు కూడా కొరియా ఓపెన్‌లో ఆడలేదు. ఈ టోర్నీలో ఆమె తొలి రౌండ్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ ఫానెత్రి (ఇండోనేసియా)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో ఏపీ స్టార్ పారుపల్లి కశ్యప్ తొలిరౌండ్లో జర్మనీకి చెందిన మార్క్ జ్విబ్లెర్‌తో పోటీపడనున్నాడు. రాష్ట్రానికి చెందిన మరో యువతార శ్రీకాంత్... యున్ హు (హాంకాంగ్)తో, గురుసాయిదత్... ఎరిక్ పాంగ్ (హాలండ్), ఆనంద్ పవార్... జెంగ్ మింగ్ వాంగ్ (చైనా)తో తలపడతారు. కాగా భారత ఆటగాళ్లెవరూ ఈ టోర్నీ డబుల్స్ ఈవెంట్‌లో పాల్గొనడం లేదు.