సైనా, అజయ్ మినహా...
హాంకాంగ్: సీజన్ చివరి సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ హాంకాంగ్ ఓపెన్‌లో భారత్ తరఫున సైనా నెహ్వాల్, అజయ్ జయరామ్ మినహా మిగతా క్రీడాకారులందరూ తొలి రౌండ్‌లోనే చేతులెత్తేశారు. సైనాకు తొలి రౌండ్‌లో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. బెలాట్రిక్స్ మనుపుట్టి (ఇండోనేసియా)తో జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా 21-14, 21-16తో విజయం సాధించింది. గురువారం జరిగే రెండో రౌండ్‌లో పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్‌సుక్ (థాయ్‌లాండ్)తో సైనా ఆడుతుంది.
గతంలో పోర్న్‌టిప్‌తో ఆడిన ఆరుసార్లూ సైనానే గెలిచింది. ప్రపంచ చాంపియన్ రత్చనోక్ (థాయ్‌లాండ్)తో జరిగిన పోటీలో సింధు 16-21, 17-21తో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ 21-7, 21-12తో ఏడో సీడ్ ఎన్గుయెన్ (వియత్నాం)ను బోల్తా కొట్టించగా... కశ్యప్ 14-21, 10-21తో జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) చేతిలో; శ్రీకాంత్ 18-21, 14-21తో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్; మిక్స్‌డ్ డబుల్స్‌లో తరుణ్ కోనా-అశ్విని తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు.