తమిళ్ తలైవాస్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరిని పట్టేసిన దబంగ్ ఢిల్లీ ఆటగాళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో మరో హోరాహోరీ సమరం ప్రేక్షకుల్ని మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి నిమిషాల్లో అనూహ్యంగా ఢిల్లీ దూసుకొచ్చింది. ఎంతో దూరంలో ఉన్న స్కోరును క్షణాల వ్యవధిలోనే సమం చేసింది. చివరికి ఒకే ఒక్క పాయింట్‌తో తలైవాస్ గెలుపు తలుపుల్ని మూసేసింది. అప్పటిదాకా తొడగొట్టిన తమిళ్ తలైవాస్‌ను చావోరేవో రైడింగ్‌లో నవీన్ కుమార్ పడగొట్టాడు. దీంతో దబంగ్ ఢిల్లీ 30–29 స్కోరుతో తలైవాస్‌పై విజయం సాధించింది. రైడర్ నవీన్ కుమార్ 8 పాయింట్లు సాధించాడు. తొలి అర్ధభాగం ముగిసేసమయానికి తలైవాస్ 18–11తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో కూడా ఆధిక్యాన్ని కొనసాగించింది. 28–11తో గెలుపుబాటలో పయనించింది.
అనూహ్యంగా ఆఖరి 4 నిమిషాలు తలైవాస్‌ను ముం చాయి. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ సూపర్ రైడ్ చేయడంతో మూడు పాయింట్లు వచ్చాయి. దీంతో దబంగ్ 27–29తో పోటీలో పడింది. మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మరో రెండు నిమిషాల్లో 29–29తో స్కోరు సమమైంది. చావోరేవో (డు ఆర్ డై) రైడింగ్‌కు వెళ్లిన నవీన్... మంజీత్‌ను ఔట్ చేసి ఢిల్లీని గెలిపించాడు. తమిళ్ తలైవాస్ జట్టులో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 7 పాయింట్లు చేసినప్పటికీ రైడింగ్‌లో నాలుగుసార్లే సఫలమయ్యాడు. మరో రైడర్ అజయ్ కుమార్ 16 సార్లు కూతకెళ్లి 5 పాయింట్లు తెచ్చాడు. డిఫెండర్ మంజీత్ చిల్లర్ (5) రాణించగా, మిగతా వారిలో అజిత్, మోహిత్ చిల్లర్ చెరో 2 పాయింట్లు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్; పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment