పవన్ నేగీ అవుట్!
ముంబై: ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా నిలిచిన పవన్ నేగీని ఢిల్లీ డేర్డెవిల్స్ ఫ్రాంచైజీ విడుదల చేసింది. పవన్ నేగీకి చెల్లించే మొత్తం ఎక్కువగా ఉండటంతోనే అతన్ని వచ్చే సీజన్ లో పాల్గొనే ఢిల్లీ జట్టు నుంచి విడుదల చేసినట్లు డేర్ డెవిల్స్ స్పష్టం చేసింది. 'అవును పవన్ నేగీని జట్టు నుంచి తొలగించాం. ఇక్కడ ప్రదర్శన ఆధారంగానే అతని విడుదలపై నిర్ణయం తీసుకున్నాం. దాంతో పాటు అతని ధర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ రెండు కారణాలతో పవన్ నేగీని విడుదల చేయాల్సి వచ్చింది' అని ఢిల్లీ డేర్ డెవిల్స్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
గత ఐపీఎల్ వేలంలో పుణే సూపర్ జెయింట్స్ తో పోటీపడి పవన్ నేగీని దక్కించుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ఏడాది వ్యవధిలోనే అతన్ని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 8.5 కోట్లు చెల్లించి పవన్ ను ఢిల్లీ కొనుగోలు చేసింది. అయితే గడిచిన ఐపీఎల్లో పవన్ నేగీ ఎనిమిది మ్యాచ్లు ఆడి 57 పరుగులు మాత్రమే చేయడం అతని తొలగింపుకు ప్రధాన కారణమైంది. భారత్ తరపున నేగీ ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆసియాకప్లో యూఏఈతో జరిగిన మ్యాచ్లో నేగీ పాల్గొన్నాడు. ఆ తరువాత ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20కి నేగీని ఎంపిక చేసినా రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇదిలా ఉండగా, పవన్ నేగీతో సహా ఐదుగురు ఆటగాళ్లను ఢిల్లీ డేర్ డెవిల్స్ విడుదల చేయడం గమనార్హం.