ఓడిపోతే ఢిల్లీకి పోయేదేమీ లేదు! గెలిస్తే చెన్నైకు రన్‌రేట్ పెరగడం తప్ప ఒరిగేదేమీ లేదు! అభిమానులకు చూద్దామన్న ఆశ అంతకంటే లేదు...! దీనికి తగినట్లే ఆటలో మెరుపే లేదు...! పరుగులకు ఇబ్బంది పెట్టిన పిచ్‌పై ఆడుతున్నది టి20నా...? వన్డేనా...? అన్నట్లు సాగిన మ్యాచ్‌లో నమోదైంది ఒకే ఒక్క అర్ధ శతకం...! ఢిల్లీనే సాధారణ స్కోరు చేసిందనుకుంటే... చెన్నై అతి సాధారణంగా ఆడి ఓడింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షల్ పటేల్ (16 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు; 1/23) ఆల్‌రౌండ్ ప్రతిభతో డేర్‌డెవిల్స్‌కు ఊరట విజయం దక్కింది.
ఢిల్లీ: అదేంటో మరి... ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు సీజన్ చివర్లో కాని జోష్ రాదనుకుంటా...! వరుస పరాజయాలతో ప్లే ఆఫ్‌కు ఎప్పుడో దూరమై... ప్రేక్షకులకు ఏ కోశానా ఆసక్తి లేకుండా పోయిన వేళ... ఆ జట్టు పటిష్ఠమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ఆశ్చర్యపర్చింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ... నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హర్షల్‌తో పాటు రిషభ్ పంత్ (26 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), విజయ్ శంకర్ (28 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో అంబటి తిరుపతి రాయుడు (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా మిగతావారి నుంచి మెరుపులు లేకపోవడంతో చెన్నై ఆరు వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేసి 34 పరుగులతో ఓటమి పాలైంది. లెగ్ స్పిన్నర్లు అమిత్ మిశ్రా (2/20), సందీప్ లమిచానే (1/21) ప్రత్యర్థిని కట్టిపడేశారు.
అంతా చప్పచప్పగా...
పంత్, హర్షల్ మినహా ఏ బ్యాట్స్‌మెన్ స్ట్రయిక్ రేట్ 130 దాటలేదంటేనే డేర్ డెవిల్స్ ఇన్నింగ్స్ సాగిన తీరును చెప్పొచ్చు. ఓపెనర్లలో పృథ్వీ షా (17) పూర్తిగా తడబడుతూ ఆడాడు. చాలా బంతులు అతడి బ్యాట్‌కు దగ్గరగా వెళ్లాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (19) బ్యాట్ ఝళిపించలేకపోయాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి స్కోరు 39/1. ఆ తర్వాత కూడా రిషభ్, అయ్యర్‌లను చెన్నై బౌలర్లు స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. హర్భజన్ వేసిన 10వ ఓవర్లో పంత్ రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టడంతో కొంత కదలిక వచ్చింది. కానీ, మరుసటి ఓవర్లోనే ఇన్‌గిడి ఇద్దరినీ అవుట్ చేశాడు. వైఫల్యాల పరంపర కొనసాగిస్తూ... జడేజా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు యత్నించి మ్యాక్స్‌వెల్ (5) బౌల్డయ్యాడు. గత మ్యాచ్‌లో గడగడలాడించిన అభిషేక్ శర్మ (2) ఈసారి చేతులెత్తేశాడు. 15 ఓవర్లకు స్కోరు 102/5. విజయ్ శంకర్, హర్షల్ అప్పుడో షాట్ ఇప్పుడో షాట్ కొడుతూ బండి నడిపించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బ్రేవో పనిపట్టారు. హర్షల్ మూడు, శంకర్ ఒక సిక్స్ బాదడంతో ఈ ఓవర్లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. దీంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. విశేషమేమంటే బంతితో గిమ్మిక్కులు చేస్తూ, బ్యాట్స్‌మెన్‌ను బుట్టలో పడేస్తాడని పేరున్న బ్రేవో... హర్షల్ ధాటికి భారీగా (0/52) పరుగులిచ్చుకున్నాడు. అతడు కొట్టిన నాలుగు సిక్స్‌లూ బ్రేవో బౌలింగ్‌లోనే కావడం గమనార్హం.
చెన్నై ఛేదించలేకపోయింది...
లక్ష్యం మరీ పెద్దదేం కాదు. ప్రత్యర్థి బౌలింగ్ ఏమంత భీకరం కాదు. దీంతో ఛేదనను చెన్నై ఊదేస్తుందని అంతా భావించారు. కానీ, వారికీ పరుగులు గగనంగానే వచ్చాయి. 5 ఓవర్లకు స్కోరు 22 మాత్రమే. అయితే, అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రాయుడు మూడు సిక్స్‌లు, ఫోర్ సహా 22 పరుగులు రాబట్టడంతో ఒక్కసారిగా కదలిక వచ్చింది. కానీ, మిశ్రా వస్తూనే వాట్సన్‌ను బుట్టలో వేశాడు. ఓ ఎండ్‌లో తనవంతుగా ఆడుతూ అర్ధ సెంచరీ (28 బంతుల్లో) అందుకున్న రాయుడు ... భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో మ్యాక్స్‌వెల్‌కు చిక్కాడు. అప్పటికీ ధోని (17), రైనా (15) ఉండటంతో గెలుపుపై ఆశలున్నాయి. తొలి బంతికే అవుటయ్యే ప్రమాదం తప్పించుకుని, ఆసాంతం ఇబ్బందిగా కనిపించిన రైనాను సందీప్ లమిచానే పెవిలియన్‌కు చేర్చాడు. సమీకరణం 41 బంతుల్లో 73గా ఉన్న దశలో బిల్లింగ్స్ (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. జడేజాను మరోసారి బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా పంపినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లు ధోనికి షాట్లు కొట్టే చాన్సే ఇవ్వలేదు. దీంతో లక్ష్యం అంతకంతకు పెరుగుతూ పోయింది. 18వ ఓవర్లో ధోనిని అవుట్ చేసిన బౌల్ట్ ఐదు పరుగులే ఇచ్చాడు. 12 బంతుల్లో 50 పరుగులు చేయడం జడేజా(27 నాటౌట్), బ్రావో (1) తరం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment