
సాక్షి, విజయవాడ: సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (129 బంతుల్లో 95; 9 ఫోర్లు, ఒక సిక్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ జట్టును రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌కు చేర్చాడు. మధ్యప్రదేశ్‌తో సోమవారం ముగిసిన ఐదు రోజుల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 217 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 51.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఓపెనర్ కునాల్ చండేలా (57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో గంభీర్ రెండో వికెట్‌కు 98 పరుగులు... ధ్రువ్ (46 నాటౌట్; 6 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 95 పరుగులు జోడించాడు. 2009–2010 సీజన్ తర్వాత ఢిల్లీ జట్టు రంజీ ట్రోఫీలో సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి.
గుజరాత్ ఇంటిముఖం...
డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్, బెంగాల్ జట్ల మధ్య జైపూర్‌లో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా బెంగాల్ జట్టు సెమీస్ చేరింది. చివరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 483/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్ మ్యాచ్ ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 695 పరుగులు చేసింది.
తొలిసారి విదర్భ...
కేరళతో సూరత్‌లో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో విదర్భ జట్టు 412 పరుగుల ఆధిక్యంతో గెలిచి తొలిసారి రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌కు చేరింది. 578 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ రెండో ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆదిత్య సర్వాతే (6/41) విదర్భ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 431/6తో బ్యాటింగ్ కొనసాగించిన విదర్భ జట్టు తొమ్మిది వికెట్లకు 507 పరుగులవద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈనెల 17న మొదలయ్యే సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో కర్ణాటకతో విదర్భ; బెంగాల్‌తో ఢిల్లీ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment