
ఉమేశ్ ను చితక్కొట్టేశాడు!
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి శుభారంభం లభించింది. ఓపెనర్లు సంజూ శాంసన్ (39; 25 బంతుల్లో 7 ఫోర్లు), శ్యామ్ బిల్లింగ్స్(21;17బంతుల్లో 2 ఫోర్లు) లు చక్కటి ఆరంభాన్నిఅందించారు. ఆ తరువాత కరుణ్ నాయర్(21;27 బంతుల్లో1 ఫోర్),శ్రేయస్ అయ్యర్(26;17 బంతుల్లో4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఈ జోడి నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్ కు చేరిన తరువాత ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను రిషబ్ పంత్ తీసుకున్నాడు.
తొలుత కుదురుగా ఆడిన రిషబ్ పంత్..ఉమేశ్ యాదవ్ వేసిన 17 ఓవర్ లో విశ్వరూపం ప్రదర్శించాడు. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్ లో ఉమేశ్ చితక్కొట్టిన రిషబ్ మొత్తంగా 26 పరుగులు రాబట్టాడు. రిషబ్ పంత్ సాధించిన 38 పరుగుల్లో 26 పరుగులు ఒకే ఓవర్ లో వచ్చేయంటే అది అతని బ్యాటింగ్ లో దూకుడుకు అద్దం పడుతోంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ ఆరో వికెట్ గా అవుటైన తరువాత ఢిల్లీ స్కోరు బోర్డులో వేగంగా తగ్గింది. చివరి వరుస ఆటగాళ్లలో క్రిస్ మోరిస్(16;9 బంతుల్లో 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి168 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో కౌల్టర్ నైల్ మూడు వికెట్లు సాధించగా, వోక్స్, యాదవ్, నరైన్ లకు తలో వికెట్ దక్కింది. ఉమేశ్ యాదవ్ నాలుగు ఓవర్లలో అత్యధికంగా 53 పరుగులివ్వడం గమనార్హం.