ఉమేశ్, ఇషాంత్లు వచ్చేశారు..
కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ గురువారం ఈడెన్ గార్డెన్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ గౌతం గంభీర్.. తొలుత కింగ్స్ పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్లు సీజన్ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. కోల్ కతా నైట్ రైడర్స్ తుది జట్టులోకి ఉమేశ్ యాదవ్ రాగా, కింగ్స్ పంజాబ్ జట్టులోకి ఇషాంత్ శర్మ వచ్చేశాడు.
వరుసగా రెండు విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్న జట్టు కింగ్స్ పంజాబ్ ఎలెవన్. ఈ ఏడాది మ్యాక్స్ వెల్ నేతృత్వంలోని కింగ్స్ పంజాబ్ మంచి దూకుడు మీద ఉంది. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ సమష్టిగా రాణిస్తూ పాయింట్ల పట్టికలో ముందంజలో ఉంది. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ విజయం సాధించేందుకు కింగ్స్ పంజాబ్ సిద్ధమైంది. మరొకవైపు కోల్ కతా జట్టు కూడా పటిష్టంగానే ఉండటంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్ల బలబలాల్లో కోల్ కతాదే పైచేయి. ఐపీఎల్లో ఇప్పటివరకూ ఇరు జట్లు 19సార్లు తలపడగా 13 సార్లు కోల్ కతానే విజయం సాధించింది. దాంతో విజయంపై కోల్ కతా ధీమా వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో పేలవమైన రికార్డుకు చెక్ పెట్టాలని కింగ్స్ పంజాబ్ భావిస్తోంది.
కోల్ కతా తుదిజట్టు; గౌతం గంభీర్(కెప్టెన్), రాబిన్ ఊతప్ప, మనీష్ పాండే, యూసఫ్ పఠాన్, సూర్యకుమార్ యాదవ్, కోలిన్ డి గ్రాండ్ హోమ్, క్రిస్ వోక్స్, సునీల్ నరైన్, పియూష్ చావ్లా, ట్రెంట్ బౌల్ట్, ఉమేశ్ యాదవ్
కింగ్ప్ పంజాబ్ తుదిజట్టు: గ్లెన్ మ్యాక్స్ వెల్(కెప్టెన్), హషీమ్ ఆమ్లా, అక్షర్ పటేల్, మనన్ వోహ్రా, వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్, స్టోనిస్, మోహిత్ శర్మ, సందీప్ శర్మ, ఇషాంత్ శర్మ, వరుణ్ అరోన్