కింగ్స్ పంజాబ్ కు బ్రేక్ వేస్తారా?
కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో వరుసగా రెండు విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్న జట్టు కింగ్స్ పంజాబ్ ఎలెవన్. ఈ ఏడాది మ్యాక్స్ వెల్ నేతృత్వంలోని కింగ్స్ పంజాబ్ మంచి దూకుడు మీద ఉంది. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ సమష్టిగా రాణిస్తూ పాయింట్ల పట్టికలో ముందంజలో ఉంది. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ విజయం సాధించేందుకు కింగ్స్ పంజాబ్ సిద్ధమైంది. గురువారం రాత్రి గం.8.00 ని.లకు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో కింగ్స్ పంజాబ్ తలపడనుంది. ఈ ఐపీఎల్లో ప్రస్తుతం కోల్ కతా నైట్ రైడర్స్ ఒక విజయం, ఒక పరాజయంతో ఐదో స్థానంలో ఉంది.
ఐపీఎల్లో భాగంగా గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్లో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది కోల్ కతా. ఆపై ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమిని కొనితెచ్చుకుంది. ఆ మ్యాచ్ లో విజయం అంచుల వరకూ వెళ్లిన కోల్ కతా పలు క్యాచ్ లను నేలపాలు చేసి చేజాతులా ఓటమి పాలైంది.
ఇదిలా ఉంచితే, కింగ్స్ పంజాబ్ పై కోల్ కతా కు మెరుగైన రికార్డే ఉంది. ఓవరాల్ ఐపీఎల్లో ఇరు జట్లు 19సార్లు తలపడగా 13 సార్లు కోల్ కతానే విజయం సాధించింది. ఇదిలా ఉంచితే ఈ రోజు మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్ లో సైతం పంజాబ్ పై కోల్ కతా తిరుగులేని రికార్డు కల్గి ఉంది. ఈ రెండు జట్లు ఇక్కడ ఎనిమిదిసార్లు తలపడిన ముఖాముఖి పోరులో కోల్ కతా ఆరుసార్లు విజయం దక్కించుకుంది. ఆ క్రమంలోనే ఇరు జట్ల మధ్య జరిగిన చివరి ఏడు మ్యాచ్ ల్లో కోల్ కతాదే విజయం. దాంతో ఇక్కడ కోల్ కతానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. అయితే కింగ్స్ పంజాబ్ కూడా పటిష్టంగా ఉండటంతో కోల్ కతా తో జరిగే తాజా పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.